ఆందోళనకు రైతు సంఘాలు సిద్ధం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: రూ. 1.2 లక్షల కోట్ల భారీ ప్రాజెక్టుకు సంబంధించి కనీసం డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు కూడా తయారు చేయలేదు. అసలు భూసేకరణ ఏ విధంగా చేస్తారనే అంశంపై అధికారులకు సైతం ఎలాంటి స్పష్టతా లేదు. ఈ ప్రాజెక్టు కోసం కనీసం 5 వేల ఎకరాల భూమి తీసుకుంటామని చెబుతూనే, ప్రజాభిప్రాయంతో నిమిత్తం లేకుండా ప్రాథమికంగా 20 ఎకరాల భూమిని లీజుకు తీసుకుని డ్రోన్ సర్వే పనులు ప్రారంభించారు. దశాబ్దాలుగా వాణిజ్య పంటలతో సహా అన్ని రకాల పంటలు పండుతున్న సారవంతమైన భూములను కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేయడంపై స్థానిక రైతాంగం నుంచి తీవ్ర ప్రతిఘటన మొదలైంది.
చింతలపూడి మండలంలోని రేచర్ల భూగర్భ బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుపై మెట్ట ప్రాంత రైతాంగంలో తీవ్ర అలజడి వ్యక్తమవుతోంది. కనీసం డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) సిద్ధం చేయకుండా, భూసేకరణపై స్పష్టత ఇవ్వకుండా రూ. 1.2 లక్షల కోట్ల అంచనా వ్యయంతో నిర్మించే ఈ భారీ ప్రాజెక్టు పనులను ప్రారంభించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా వాణిజ్య పంటలు సాగుచేస్తున్న సారవంతమైన భూములను కార్పొరేట్ సంస్థలకు దారాదత్తం చేయడంపై నిరసనలు మొదలయ్యాయి.
డ్రోన్ సర్వే ప్రారంభం
చింతలపూడి మండలంలోని రేచర్లలో 600 మీటర్ల లోతులో బొగ్గు నిల్వలు ఉన్నట్లు 40 ఏళ్ల క్రితమే పరిశోధనల్లో తేలింది. అయితే ప్రత్యక్ష మైనింగ్ సాధ్యపడకపోవడంతో భూగర్భంలోనే పైప్‌లైన్ల ద్వారా బొగ్గును మండించి వాయువును వెలికితీసే అండర్ గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్ విధానానికి తెరతీశారు. చింతలపూడి బ్లాక్‌లోని 1,200 హెక్టార్లలో 904.04 మిలియన్ టన్నులు, రేచర్ల బ్లాక్‌లోని 2,225 హెక్టార్లలో 2,225.5 బిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించారు. ఇందులో భాగంగా తొలివిడతగా 20 ఎకరాల భూమిని లీజుకు తీసుకున్న రిలయన్స్ సంస్థ ఇప్పటికే డ్రోన్ సర్వే పనులను ప్రారంభించింది.
సమీక్ష సమావేశంలో ఆదేశాలు
దేశంలోనే మొదటిదైన ఈ భూగర్భ బొగ్గు వాయువు ఉత్పత్తి కాంప్లెక్స్ నిర్మాణానికి రిలయన్స్ సంస్థకు పూర్తి సహకారం అందించాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. చింతలపూడి, రేచర్ల, శెట్టివారిగూడెం పరిధిలోని ఏడు గ్రామాల్లో సుమారు 4 నుంచి 5 వేల ఎకరాల భూసేకరణకు సిద్ధంగా ఉండాలని ఇటీవల నిర్వహించిన సమీక్షా సమావేశంలో వెల్లడించారు.
పరిహారంపై స్పష్టత కరువు
భారీ పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు మంచివే అయినప్పటికీ, భూసేకరణ ప్రక్రియ, నష్టపరిహారం, సింగరేణి తరహా ఉద్యోగాల కల్పన, ఇళ్లకు ఇచే పరిహారాలపై ఎలాంటి ప్రాథమిక సమాచారం లేకపోవడం రైతుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. అలాగే భూ గర్భంలో బొగ్గును కాల్చడం వల్ల కొన్నేళ్ల తర్వాత భూగర్భ జలాలు విషతుల్యమయ్యే ప్రమాదం ఉందని, ప్లాంట్ ఉద్గారాల వల్ల మెట్ట ప్రాంతమంతా సాగుకు పనికిరాకుండా పోతుందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. జనావాసాలకు నష్టం వాటిల్లడమే కాకుండా, భూ ప్రకంపనలు వచ్చి నేల కుంగిపోయే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు.
రేచర్ల బొగ్గు గ్యాసిఫికేషన్ పనులపై పెరుగుతున్న అనుమానాలు
వేల ఎకరాల భూముల స్వాహాకు సరికొత్త ఎత్తుగడ
వాణిజ్య పంటలు పండే భూముల్లో గ్యాస్ ప్లాంట్
కనీస అవగాహన, ప్రాజెక్టు వాస్తవాలు వెల్లడించాలని రైతుల డిమాండ్
బొగ్గుగనిపై అన్నదాతల పోరుబాట
సాధారణంగా ఏదైనా ప్రాజెక్టు ప్రారంభించేముందు డీపీఆర్ ఆమోదించి, లాభనష్టాలను రైతులకు వివరించి గ్రామసభల ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ జరపాల్సి ఉంటుంది. భూసేకరణపై గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చి పరిహారం నిర్ణయించాలి. రెండో విడతలో సేకరించే భూమికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి పరిహారాన్ని మార్కెట్ ధరకు అనుగుణంగా నిర్ణయిస్తారా? లేదా రాజధాని తరహాలో పూలింగ్ చేస్తారా? అనే అంశంపై స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. ఇవేమి లేకుండా లక్ష కోట్ల ప్రాజెక్టుకు అందరూ సహకరించాలని చెప్పడంపై రైతు సంఘాలు భగ్గుమన్నాయి. ఈ మేరకు సమావేశం నిర్వహించి డీపీఆర్‌ను ప్రకటించాలని, లేకపోతే ప్రాజెక్టును అడ్డుకుంటామని హెచ్చరించాయి.


