తాడేపల్లిగూడెం: విద్యార్థుల సమగ్ర వికాసంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని ఏపీ నిట్ పరిశోధన, సంప్రదింపుల విభాగం డీన్ జి.రవికిరణ్ శాస్త్రి అన్నారు. మేజర్ ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకుని శనివారం నిట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యమివ్వడం వల్ల శారీరక, మానసిక దృఢత్వం చేకూరుతుందన్నారు. క్రీడల వల్ల క్రమశిక్షణ, సమయపాలన, నాయకత్వ లక్షణాలు, జట్టుగా పనిచేసే నైపుణ్యం పెరుగుతాయని తెలిపారు. విద్యార్థులు రోజువారీ జీవితంలో కొంత సమయాన్ని క్రీడలు, వ్యాయామానికి కేటాయించాలని సూచించారు. విద్యార్థి సంక్షేమ విభాగం డీన్ హిమబిందు మాట్లాడుతూ క్రీడలు జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని ఇస్తాయన్నారు. సమన్వయకర్తగా శ్రీనివాసన్ వ్యవహరించగా, సాస్ సహాయకులు కె.వీరవెంకట సాయిరాం ప్రసాద్, సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.
పాలకొల్లు సెంట్రల్: ఎకై ్సజ్ స్టేషన్‌లో పెండింగ్‌లో ఉన్న కేసుల్లో త్వరితగతిన చార్జిషీట్లు దాఖలు చేయాలని ఎకై ్సజ్ శాఖ ఏలూరు డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ కేవీ నాగప్రభు కుమార్ ఆదేశించారు. శనివారం ఆయన స్థానిక ఎకై ్సజ్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిధిలోని పెండింగ్ కేసుల పురోగతిని పరిశీలించారు. అనంతరం ఏసీ మాట్లాడుతూ మద్యం దుకాణాలను తరచూ తనిఖీ చేస్తూ నమూనాలు సేకరించాలని సూచించారు. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, గంజాయి అక్రమ తరలింపులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ముఖ్య రహదారుల్లో వాహన తనిఖీలను విస్తృతం చేసి గంజాయి రవాణాను కట్టడి చేయాలని ఆదేశించారు. అలాగే ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ‘కేర్’ కార్యక్రమాలు నిర్వహించాలని సిబ్బందికి స్పష్టం చేశారు.
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లా కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమాన్ని ఆగస్టు 31న రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఈ మేరకు శనివారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మొగల్తూరు పర్యటన నేపథ్యంలో జిల్లా, డివిజన్, మండల స్థాయిలలో నిర్వహించే పీజీఆర్‌ఎస్‌ను తాత్కాలికంగా రద్దు చేశామని, ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.
భీమవరం (ప్రకాశంచౌక్) : జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పలు పోస్టుల భర్తీకి శనివారం స్థానిక కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి స్వయంగా పాల్గొని అభ్యర్థుల ప్రతిభను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎంపిక చేసిన పోస్టులకు సంబధించి 33 మంది అర్హులైన అభ్యర్థుల్లో 27 మంది ఇంటర్వ్యూలకు హాజరవ్వగా, ఆరుగురు గైర్హాజరయ్యారన్నారు. నిబంధనల ప్రకారం ఎంపిక ఉంటుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఇంటర్వ్యూ కమిటీ సభ్యులు డీఆర్‌ఓ పి.గ్లోరియా, జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ అధికారి డి.శ్రీలక్ష్మి, డీఎస్పీ రఘువీర్ విష్ణు, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి అరుణకుమారి, బాలల సంరక్షణ అధికారి ఆర్.రాజేష్ పాల్గొన్నారు.
ఉంగుటూరు: పొలంలో పని చేస్తుండగా పాము కాటేసి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన శనివారం ఉంగుటూరు మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం గోకవరం గ్రామానికి చెందిన గండికోట ఏసురత్నం (33) తన పొలంలో పని చేస్తున్న సమయంలో పాము కాటేసింది. గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడి తండ్రి ఏడుకొండలు ఫిర్యాదు మేరకు చేబ్రోలు ఎస్సై ఎం.సూర్యభగవాన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.


