రాజకీయ వర్గాల్లో చర్చ
● ఆకివీడులో స్థానిక పోరు వేడి
● ఓటర్ల జాబితా, రిజర్వేషన్లపై అధికారుల కసరత్తు
ఆకివీడు: స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి పల్లెలు, పట్టణాల్లో మొదలైంది. సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలల్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని ఇటీవల ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్రకటించడంతో క్షేత్రస్థాయిలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఎన్నికల షెడ్యూల్ నకిలీదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ స్పష్టం చేశారు. అయితే, స్థానిక సంస్థల పదవీ కాలం ముగియడం, కొన్ని చోట్ల ముగింపునకు దగ్గరపడటంతో ఎన్నికల ఊహాగానాలు పుంజుకున్నాయి. ఆకివీడు నగర పంచాయతీ పదవీ కాలం కూడా ముగుస్తుండటంతో, అధికారులతో పాటు రాజకీయ పార్టీలు ఎన్నికల కసరత్తు ప్రారంభించాయి. వార్డుల విభజన ప్రక్రియ ఇప్పటికే పూర్తి కావడంతో, రానున్న ఎన్నికల్లో 28 వార్డులకు పోటీ జరగనుంది.
ఓటర్ల జాబితా సిద్ధం
ఎన్నికల నిర్వహణకు కావలసిన ఏర్పాట్లలో నగర పంచాయతీ యంత్రాంగం నిమగ్నమైంది. సెప్టెంబర్ 3వ తేదీ నాటికి ఓటర్ల తుది జాబితాను సిద్ధం చేయడానికి అధికారులు చర్యలు వేగవంతం చేశారు. ప్రభుత్వం సూచించిన నిబంధనల ప్రకారం మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కేటాయించనున్నారు. స్థానిక ఓటర్ల జనాభా ప్రాతిపదికన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ వర్గాలకు రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు.
బీసీ రిజర్వేషన్లపై అనిశ్చితి
స్థానిక సంస్థల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, న్యాయపరమైన అంశాల దృష్ట్యా ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ ఆగస్టు 31లోగా నివేదిక సమర్పించాల్సి ఉన్నా, గడువులోగా పూర్తయ్యే సంకేతాలు కనిపించడం లేదు. దీంతో రాబోయే ఎన్నికల్లో పాత పద్ధతిలోనే బీసీ రిజర్వేషన్లు అమలు కానున్నాయని భావిస్తున్నారు.
రిజర్వేషన్ల ప్రక్రియ స్థానిక నగర పంచాయతీ పరిధిలోనే జరగనుంది. అయితే రిజర్వేషన్ల ఖరారు జనాభా ప్రాతిపదికన కాకుండా స్థానిక ప్రజాప్రతినిధుల (ఎమ్మెల్యేల) సూచనల మేరకే జరుగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు పార్టీల పరంగా ఆయా వార్డుల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై ముమ్మర చర్చలు సాగుతున్నాయి.


