ఆగిరిపల్లి: మంత్రి కొలుసు పార్థసారథి నియోజకవర్గంలో తాగునీటి ఎద్దడి తారస్థాయికి చేరింది. మంచినీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆగిరిపల్లి కొండ కాలనీకి చెందిన మహిళలు శనివారం సాయంత్రం స్థానిక స్టేట్ బ్యాంక్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. గత ఎనిమిది నెలలుగా తమ ప్రాంతానికి నీటి సరఫరా నిలిచిపోవడంతో తీవ్ర అవస్థలు పడుతున్నామని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులకు, అధికార పార్టీ నాయకులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోకపోవడంతోనే రోడ్డెక్కామని ఆవేదన వ్యక్తం చేశారు. నెలకు రూ.1000పైగా వెచ్చించి నీటిని కొనుగోలు చేయాల్సి వస్తోందని తెలిపారు. ధర్నాతో ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న డీఎస్పీ ప్రసాద్, ఎస్సై నాగరాజు నిరసనకారులతో మాట్లాడారు. సోమవారం సంబంధిత అధికారులతో చర్చించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇవ్వడంతో మహిళలు ధర్నా విరమించారు.


