ఒక్క నెల తేడాతో తీవ్ర అన్యాయం
తక్షణమే సాయం అందించాలి
కుక్కునూరు: అభివృద్ధి ప్రాజెక్టుల కోసం ఇళ్లు, భూములు త్యాగం చేసిన నిర్వాసితులందరికీ సమానంగా న్యాయం చేయాలని పోలవరం ప్రాజెక్టు బాధిత కుటుంబాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. వెలిగొండ సాగునీటి ప్రాజెక్టు పరిధిలోని 18 ఏళ్లు నిండిన యువతీ యువకులకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించడాన్ని స్వాగతిస్తున్న పోలవరం నిర్వాసితులు, తమ పిల్లలకు కూడా అదే తరహా న్యాయం చేయాలని కోరుతున్నారు.
కటాఫ్ పేరుతో అన్యాయం
ఏళ్ల తరబడి సాగిన నిరీక్షణ తర్వాత 2025లో ప్రభుత్వం తమ ఖాతాల్లో పరిహార నగదు జమ చేసిందని కుక్కునూరు, వేలేరుపాడు మండలాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలుకు ప్రభుత్వం 2017 జూన్‌ను కటాఫ్ తేదీగా నిర్ణయించింది. అయితే, ఆ తేదీ నాటికి చిన్నారులుగా ఉన్నవారు ప్రస్తుతం 18 ఏళ్లు దాటి, కుటుంబ బాధ్యతలు మోసే స్థాయికి ఎదిగారు. ప్రస్తుతం వీరందరూ గ్రామాలు వదిలి పునరావాస ప్రాంతాలకు వెళ్తున్నప్పటికీ, పాత కటాఫ్ తేదీని సాకుగా చూపుతూ పరిహారం నిరాకరించడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు.
వెలిగొండలో రూ.2 లక్షల సాయం
వెలిగొండ ప్రాజెక్టులో 2019 కటాఫ్ తేదీ తర్వాత 18 ఏళ్లు నిండిన అర్హులైన యువతీ యువకులకు రూ. 2 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే మానవతా దృక్పథాన్ని పోలవరం నిర్వాసితుల పట్ల కూడా చూపాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు. వెలిగొండ బాధితులకు మండలాన్ని ఒక యూనిట్‌గా పరిగణించినట్లే కుక్కునూరు, వేలేరుపాడు మండలాలను యూనిట్‌గా తీసుకుని ప్రత్యేక ఆర్థిక సాయం లేదా పునరావాస ప్రయోజనాలు కల్పించాలని కోరుతున్నారు.
పోలవరం ప్రాజెక్టు
పోలవరం నిర్వాసితులకూ ‘వెలిగొండ’ తరహా ప్యాకేజీ ఇవ్వాలి
కటాఫ్ తేదీ సాకుతో యువతకు అన్యాయం చేయొద్దు
కుక్కునూరు, వేలేరుపాడు మండలాల ప్రజల డిమాండ్
2017 కటాఫ్ తేదీకి ఒక్క నెల వయస్సు తగ్గడంతో నన్ను అనర్హుడిగా ప్రకటించారు. తండ్రి లేకపోవడంతో కుటుంబ బాధ్యతలన్నీ నేనే మోస్తున్నాను. ప్రభుత్వం స్పందించి నాకు న్యాయం చేయాలి.
– తాండ్ర సత్య అన్వేష్, కుక్కునూరు
వెలిగొండ ప్రాజెక్టులో 18 ఏళ్లు దాటిన యువతను ఆదుకునేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అభినందనీయం. అయితే కుక్కునూరు, వేలేరుపాడు మండలాల నిర్వాసితులు 2017 నుంచి పోరాడుతున్నా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం బాధాకరం. ప్రభుత్వం తక్షణమే సానుకూల ప్రకటన చేయాలి.
– కొన్నే లక్ష్మయ్య, సీపీఐ మండల కార్యదర్శి, కుక్కునూరు


