ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రేషన్ డోర్ డెలివరీ విధానం వృద్ధులు, దివ్యాంగులు, మహిళా డీలర్లకు ఎంతో కష్టతరంగా మారుతోందని రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజులపాటి గంగాధర్‌గౌడ్, ఏలూరు జిల్లా అధ్యక్షుడు తలారి రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం ప్రతి బియ్యం బస్తాను వెయింగ్ మిషన్‌పై ఉంచి రెండుసార్లు స్కానింగ్ చేసిన తర్వాతే ఈ–పాస్ యంత్రంలో రిసీవ్ అయ్యేలా నిబంధనలు అమలు చేస్తున్నారని తెలిపారు. ఈ విధానంతో పాటు, ఐవీఆర్‌ఎస్ కాల్స్ ద్వారా కార్డుదారుల ఫీడ్‌బ్యాక్ వంటి అంశాలు డీలర్లకు ఇబ్బందికరంగా మారాయన్నారు. ప్రతి డీలర్‌కు నెలకు కనీసం రూ.25 వేల ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడకు వినతిపత్రం అందజేశారు.


