భీమవరం టీడీపీలో ఆక్వా రగడ | - | Sakshi
Sakshi News home page

భీమవరం టీడీపీలో ఆక్వా రగడ

Aug 26 2026 1:36 AM | Updated on Aug 26 2026 1:36 AM

భీమవరం: భీమవరం నియోజకవర్గ టీడీపీలో ఆక్వా రగడ రాజుకుంటోంది. పార్టీ నాయకులు నడిరోడ్డుపై బాహాబాహీకి దిగినా, పార్టీ పెద్దలు పట్టించుకోకపోవడంపై సర్వత్రా చర్చనీయాంశమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆక్వా రైతుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని, తక్షణమే విద్యుత్‌ సబ్సిడీ అమలు చేస్తామని ఎన్నికల్లో పెద్దఎత్తున ప్రచారం చేశారు. అయితే, అధికారం చేపట్టి రెండేళ్లు గడుస్తున్నా విద్యుత్‌ సబ్సిడీ హామీని అమలు చేయలేకపోయారు. దీనికి తోడు ఆక్వా ఫీడ్‌, సీడ్‌ ధరలు విపరీతంగా పెరిగిపోవడమేగాక, రొయ్యల ధరలు గణనీయంగా పడిపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆక్వా రైతులు రాజకీయాలకు అతీతంగా ఆందోళనలు చేపట్టారు. ఇందులో భాగంగానే జిల్లాలోని భీమవరం, పాలకొల్లు, వీరవాసరం తదితర ప్రాంతాల్లో రైతులు ఆక్వా ఫీడ్‌ బస్తాలను తగలబెట్టడం, రొయ్యలను రోడ్డుపై పడేసి నిరసన తెలపడం, కొంతమంది రైతులు స్వచ్ఛందంగా క్రాప్‌ హాలిడే ప్రకటించడం వంటి ఆందోళనలతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. ఇదే సమయంలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆక్వా రైతులకు తమ పార్టీ అండగా ఉంటుందంటూ భీమవరంలో నిర్వహించిన సభకు ఆక్వా రైతుల నుంచి అనూహ్య స్పందన లభించింది.

జగన్‌ సభతో కూటమి నాయకుల్లో కలవరం

జగన్‌ సభతో ఉక్కిరిబిక్కిరైన ప్రభుత్వం, తప్పనిసరి పరిస్థితుల్లో ఆక్వా రైతులకు విద్యుత్‌ సబ్సిడీని అమలు చేసింది. అయితే ఇది కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులకు మింగుడుపడలేదు. జగన్‌ సభ వల్లే ప్రభుత్వం విద్యుత్‌ సబ్సిడీని అమలు చేసిందని రైతులు బలంగా నమ్మడంతో, ఈ సబ్సిడీ అమలు వల్ల ప్రభుత్వానికి ఎలాంటి మైలేజ్‌ రాకుండా పోయిందని పార్టీ పెద్దల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. దీంతో ఆక్వా రైతుల ఉద్యమానికి మద్దతునిచ్చిన టీడీపీ, జనసేన పార్టీ నాయకులను లక్ష్యంగా చేసుకుని పార్టీ సమావేశాల్లో విమర్శలు గుప్పించడంతో ప్రధానంగా టీడీపీలో తీవ్ర విభేదాలు తలెత్తాయి. భీమవరం పట్టణంలో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఒక పార్టీ కార్యక్రమంలో వీరవాసరం మండల పార్టీ అధ్యక్షుడు కొల్లేపర శ్రీనివాసరావు, పార్టీ మండల మాజీ అధ్యక్షుడు వీరవల్లి చంద్రశేఖర్‌ మధ్య జరిగిన వాగ్వాదం కార్యక్రమాన్ని రసాభసకు గురిచేసింది.

రెండు గ్రూపులుగా విడిపోయి

టీడీపీ నాయకులు రెండు గ్రూపులుగా విడిపోయి బాహాబాహీకి దిగినా, నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జ్‌ తోట సీతారామలక్ష్మి, జిల్లా పార్టీ అధ్యక్షుడు మంతెన రామరాజు, రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు వంటి పెద్దలు ఎవరూ జోక్యం చేసుకోకపోవడంతో ఈ వివాదం మరింత ముదురుతోందని పార్టీ క్యాడర్‌ ఆందోళన వ్యక్తం చేస్తోంది. అయితే, కొల్లేపర శ్రీనివాసరావు వివాదం వెనుక తోట సీతారామలక్ష్మి కార్యాలయం హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ కార్యాలయంలో కొంతమంది అసలు పనులను పక్కనపెట్టి, రాజకీయాల్లో తలదూర్చి నాయకుల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. భీమవరం నియోజకవర్గంలోని టీడీపీ నాయకుల మధ్య సఖ్యత లేకపోవడం వల్ల కూటమిలో చులకనైపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంమీద ఆక్వా రైతుల ఆందోళన టీడీపీలో ముసలం పుట్టిస్తోంది. ఇది చిలికిచిలికి గాలివానలా మారుతుందని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.

ప్రభుత్వ నిర్లక్ష్యంతో సంక్షోభంలో ఆక్వా రంగం

ఆక్వా రైతులకు అండగా నిలిచిన జగన్‌

జగన్‌ సభకు అనూహ్య స్పందన

కూటమి నేతల్లో కలవరం

టీడీపీ నేతల మధ్య తలెత్తిన విభేదాలు

రోడ్లపైనే బాహాబాహీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement