బుట్టాయగూడెం: జీలుగుమిల్లి మండలంలోని రమణక్కపేట టేకు రిజర్వ్ ఫారెస్ట్‌లో సోమవారం ఓ వ్యక్తి చెట్టుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. అడవికి పుట్టగొడుగుల సేకరణకు వెళ్లిన స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న జీలుగుమిల్లి సీఐ యాదగిరి, ఎస్సై క్రాంతికుమార్ సిబ్బందితో కలిసి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ప్రారంభంలో మృతుడి ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం ఆరా తీయగా.. మృతుడు బుట్టాయిగూడెం మండలం కోయ అంకంపాలెం గ్రామానికి చెందిన తెల్లం వెంకటేశ్వరరావు (53)గా కుటుంబ సభ్యులు గుర్తించారు. గత రెండు రోజులుగా వెంకటేశ్వరరావు కనిపించకపోవడంతో బంధువులు సామాజిక మాధ్యమాల ద్వారా సమాచారం ప్రచారం చేసినట్లు తెలిపారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పటికీ, ఎంత వైద్యం చేయించుకున్నా ఉపశమనం కలగడం లేదని ఆయన తరచూ ఆవేదన వ్యక్తం చేసేవారని కుటుంబ సభ్యులు పోలీసులకు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే తీవ్ర మనస్తాపానికి గురై వెంకటేశ్వరరావు అడవికి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.


