గూడెం మున్సిపాలిటీ దారెటు? | - | Sakshi
Sakshi News home page

గూడెం మున్సిపాలిటీ దారెటు?

Aug 24 2026 1:25 AM | Updated on Aug 24 2026 1:25 AM

స్థానిక సంస్థల ఎన్నికలపై ఉత్కంఠ

చైర్మన్‌ సీటుపై ఆయా వర్గాల ఊహగానాలు

తెరవెనుక పావులు కదుపుతున్న జనసేన, టీడీపీ

తాడేపల్లిగూడెం: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ రాజకీయ వర్గాల్లో గాలి కబుర్లు చక్కర్లు కొడుతున్నాయి. సోషల్‌ మీడియా మాత్రం రాజకీయ పార్టీల్లో సెగ పుట్టిస్తోంది. సర్‌ సర్వే ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో, ముసాయిదా ఓటర్ల జాబితా తయారీకి ఈ నెలాఖరు వరకు గడువు ఉంది. పూర్తిస్థాయి ఓటర్ల జాబితా అక్టోబరు నాటికి సిద్ధమవుతున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఎన్నికలు మాత్రం రాబోయే జాబితా ఆధారంగా జరగవచ్చనే ప్రచారం లేకపోలేదు. న్యాయపరమైన వ్యాజ్యాల వల్ల గూడెం మునిసిపాలిటీ ఎన్నికలు జరుగుతాయా లేదా అనే విషయంలో ఇంకా మల్లగుల్లాలు సాగుతున్నాయి. లైన్‌ క్లియర్‌ అయితే, గూడెం బరిలో చైర్మన్‌ అభ్యర్థిగా ఏ వర్గానికి చెందిన వారు పోటీ చేయవచ్చనే ఊహాగానాలు ప్రారంభమయ్యాయి.

రోస్టరా... ట్విస్టా...

రోస్టర్‌ ప్రకారం ఎన్నికల్లో ఏ వర్గానికి రిజర్వేషన్‌ ఖరారవుతుందనే అంశంపై ఎన్నో చర్చలు ముడిపడి ఉన్నాయి. గూడెం మునిసిపాలిటీ విషయానికొస్తే ‘రోస్టరా... ట్విస్టా...‘ అనే చర్చ జోరుగా సాగుతోంది. ఏదైనా పురపాలక సంఘం నూతనంగా ఏర్పడినా లేదా కొత్తగా అప్‌గ్రేడ్‌ అయినా, రిజర్వేషన్‌లు జనరల్‌ కేటగిరీ నుంచే ప్రారంభమవుతాయి. ఈ క్రమంలో జరిగే ప్రతి ఎన్నిక రోస్టర్‌ ఆధారంగానే జరుగుతుంది. అదే క్రమంలో గూడెం మునిసిపాలిటీకి ఎన్నిక జరిగితే ఏ వర్గానికి రిజర్వేషన్‌ ఖరారు కాగలదనే చర్చ సర్వత్రా నడుస్తోంది.

బీసీ మహిళా... లేదా ఓసీ జనరలా...?

1928లో పంచాయతీగా ఉన్న గూడెం 1958లో మునిసిపాలిటీగా ఆవిర్భవించింది. మెండు నరసింహారావు సర్పంచ్‌గా ఉన్న సమయంలో, అప్పటికే రెవెన్యూ గ్రామాలుగా ఉన్న జువ్వలపాలెం, తాళ్లముదునూరుపాడు, యాగర్లపల్లి, మొఖాసాగా ఉన్న కడకట్లను కలుపుతూ మునిసిపాలిటీని ఏర్పాటు చేశారు. 1980 నాటికి ఫస్ట్‌ గ్రేడ్‌ మునిసిపాలిటీగా అప్‌గ్రేడ్‌ కాగా, 2010 నాటికి సెలక్షన్‌ గ్రేడ్‌ మునిసిపాలిటీగా మారింది. 35 వార్డులు, 39 నోటిఫైడ్‌ స్లమ్‌లు, మూడు నాన్‌ నోటిఫైడ్‌ స్లమ్‌లతో 20.71 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్న ఈ ప్రాంతంలో, 2011 జనాభా లెక్కల ప్రకారం 1,03,577 మంది జనాభా ఉన్నారు.

ఇప్పటివరకు చైర్మన్లుగా ఎవరెవరంటే..

1958 నుంచి ఇప్పటివరకు ఏడుగురు మునిసిపల్‌ చైర్మన్లుగా పనిచేశారు. 2019 నుంచి ప్రత్యేకాధికారుల పాలన సాగుతోంది. తొలి చైర్మన్‌గా డాక్టర్‌ కోడే వెంకట్రావు పని చేయగా, ఆయన తర్వాత ఈలి ఆంజనేయులు, ఈలి వెంకట సత్యనారాయణ (ఈవీఎస్‌) పనిచేశారు. వీరంతా ఓసీ జనరల్‌ కేటగిరీకి చెందిన వారే. వారి తర్వాత ఓసీ జనరల్‌ కేటగిరీలో దేవతి పద్మావతి చైర్‌పర్సన్‌గా, ఆపై బీసీ జనరల్‌ కేటగిరీకి చెందిన కరణం అప్పారావు పనిచేశారు. ఆ తర్వాత ఓసీ వర్గానికి చెందిన ఈతకోట భీమశంకరరావు (తాతాజీ), 2014 నుంచి 2019 వరకు బొలిశెట్టి శ్రీనివాసరావు చైర్మన్‌గా సేవలందించారు. షెడ్యూల్‌ ప్రకారం ఎన్నిక జరిగితే బీసీ మహిళ రిజర్వేషన్‌తో 2019 తర్వాత ఎన్నిక జరగాల్సి ఉంది. ఆ తర్వాత ఎస్సీ, ఎస్టీలకు రోస్టర్‌ ప్రకారం రిజర్వేషన్‌ ఇచ్చి ఎన్నిక నిర్వహించాలి. అయితే గ్రామాల విలీన ప్రతిపాదన కారణంగా ఈ వ్యవహారం కోర్టుకెక్కడంతో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. ప్రస్తుతం ఎన్నికలు జరిగితే, రోస్టర్‌ ప్రకారం జరగని రెండు ఎన్నికలను పరిగణనలోకి తీసుకొని ఓసీ జనరల్‌కు అవకాశం ఇస్తారా లేక వేరే వర్గానికి ఛాన్స్‌ ఇస్తారా అనేది వేచి చూడాలి. పవర్‌ పాయింట్లు పెరగకుండా, రాజకీయ హవాకు ప్రతిబంధకం కాకుండా ఉండేలా ఆలోచించి ట్విస్ట్‌ ఇస్తే, బీసీలకే రిజర్వేషన్‌ దక్కే అవకాశాలున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement