ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): అమరావతి చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొనే నిమిత్తం జిల్లాకు చెందిన వివిధ క్రీడా జట్లు ఆదివారం బయలుదేరి వెళ్లాయి. ఏలూరులోని స్థానిక అల్లూరి సీతారామరాజు స్టేడియం వద్ద క్రీడాకారుల బస్సులను ఇన్‌ఛార్జ్ జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్‌కే ఖాసిం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గ, జిల్లా స్థాయిల్లో పోటీలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈనెల 24 నుంచి 27వ తేదీ వరకు తిరుపతిలో జరుగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే క్రీడాకారుల తరలింపునకు మొత్తం 7 ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశామన్నారు. ఇందులో భాగంగా ఏలూరు అల్లూరి సీతారామరాజు స్టేడియం నుంచి 5 బస్సులను, నూజివీడు నుంచి మరో 2 బస్సులను పంపినట్లు ఆయన వెల్లడించారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు విజయాలతో తిరిగిరావాలని ఆకాంక్షిస్తూ పలువురు అధికారులు, క్రీడాభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పసుపులేటి ప్రసాద్, పీడీలు గవ్వా శ్రీను, మురళీ నాయక్, కోచ్ రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు.


