న్యూస్‌రీల్
కుంటుపడుతున్న డెల్టా అభివృద్ధి
జాతీయ రహదారి అవసరం
రహదారులు అధ్వానం
సోమవారం శ్రీ 24 శ్రీ ఆగస్టు శ్రీ 2026
ఆకివీడు: ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం వల్లే ఉద్యమాలు పుట్టుకొస్తున్నాయి. ప్రజల అభీష్టం మేరకు పాలకులు పనిచేయాల్సి ఉండగా, స్వార్థ ప్రయోజనాల కోసం వ్యవహరిస్తుండటంతో ప్రజలు ఉద్యమించక తప్పడం లేదు. పాలకొల్లు–పామర్రు రహదారిని (ఎన్ హెచ్– 165) జాతీయ రహదారుల శాఖలో విలీనం చేసి 22 ఏళ్లు గడుస్తున్నా, దీని అభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా మారింది.
జాతీయ రహదారిగా గుర్తింపు.. నిలిచిపోయిన పనులు
పాలకొల్లు–పామర్రు రోడ్డును దిగమర్రు–పామర్రు రోడ్డుగా మార్చి జాతీయ రహదారి నెం.165గా గుర్తించారు. 2004లో జాతీయం చేసుకున్న ఈ శాఖ, ఇప్పటివరకు రోడ్డు విస్తరణ లేదా అభివృద్ధి పనులను చేపట్టలేదు. ఆ తర్వాత ఏర్పడిన కేంద్ర ప్రభుత్వం ఈ రహదారిని రెండు ప్రాజెక్టులుగా విభజించింది. మొదటి ప్రాజెక్టు పామర్రు– ఉప్పుటేరు, అజ్జమూరు–దిగమర్రు ప్రాంతాల అభివృద్ధికి నిధులు కేటాయించారు. రెండో ప్రాజెక్టు అజ్జమూరు నుంచి రహదారి అభివృద్ధికి రూ.1,200 కోట్లు మంజూరు చేశారు. అప్పట్లో కేంద్ర మంత్రిగా ఉన్న నితిన్ గడ్కరీ 2019లో ఆకివీడు జెడ్పీ స్కూల్ ఆవరణలో వర్చువల్ శంకుస్థాపనలు చేశారు. అయితే పామర్రు నుంచి దిగమర్రు వరకు ఇప్పటికీ రోడ్డు పనులు ప్రారంభం కాలేదు.
అలైన్ మెంట్ వివాదం.. నిలిచిన వంతెన నిర్మాణం
అధికారులు డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టును (డీపీఆర్) అప్పట్లోనే కేంద్రానికి అందజేశారు. అయితే ప్రజాప్రతినిధులు మారడంతో అలైన్‌మెంట్‌ను మార్చి, మరో రూ.2,000 కోట్లు కలిపి రూ.3,200 కోట్లతో కొత్త ప్రతిపాదనలు పంపారు. దీనిని కేంద్రం తిరస్కరించి, పాత అలైన్ మెంట్‌లో మార్పులు చేసి డీపీఆర్ పంపాలని ఆదేశించింది. కొత్త రూట్ వల్ల చెరువులు, లోతట్టు ప్రాంతాలు ఎక్కువగా ఉండటంతోపాటు, భూములు పూడ్చేందుకు భారీ వ్యయమవుతుంది. లూజ్ సాయిల్ వల్ల రోడ్డు త్వరగా పాడైపోయి వాహనదారులకు ఇబ్బంది కలుగుతుందని అధికారులతోపాటు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, ఉప్పుటేరుపై బైపాస్ వంతెన నిర్మాణానికి మూడేళ్ల క్రితం 12 పిల్లర్లు వేశారు కానీ, పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి ఎన్‌హెచ్–165 అభివృద్ధి పట్టదా అని డెల్టా ప్రజలు ఆవేదన చెందుతున్నారు. కేంద్ర మంత్రి వర్గంలో ఈ ప్రాంతానికి చెందిన ఎంపీ ఉన్నా.. రెండున్నరేళ్లుగా ఎన్ హెచ్ అభివృద్ధిని పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. ఉప్పుటేరు నుంచి అజ్జమూరు వరకూ భూసేకరణ పనులు పూర్తి చేసినా అక్కడ మట్టి పూడిక, ఇతర రహదారి పనులు ప్రారంభించడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రజలు అంటున్నారు.
అధికారుల విముఖత
ఎన్‌హెచ్–165 కొత్త అలైన్ మెంట్ రూట్‌ను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ కమిషనర్ దీని వల్ల ఉపయోగం లేదని, చెరువులు, లోతట్టు ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయని సూచించినట్టు తెలిసింది.
జాతీయ రహదారి లేకపోవడంతో ఆక్వా చెరువులు, అనుబంధ పరిశ్రమలు, విద్యా సంస్థలు, రియల్ ఎస్టేట్ రంగాలు దెబ్బతింటు న్నాయి. కొత్త పరిశ్రమలు రాకపోగా, ఉన్న పరి శ్రమలు కూడా తరలిపోతున్నాయని ప్రజలు ఆ వేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి ఎన్ హెచ్–165 పనులను తక్షణమే ప్రారంభించేలా అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
కూటమి నిర్లక్ష్యం
పాత అలైన్‌మెంట్‌కు ప్రజాప్రతినిధులు ససేమిరా !
కొత్త అలైన్‌మెంట్‌కు కేంద్రం నో
శంకుస్థాపన చేసి ఏడేళ్లు
ఎన్‌హెచ్‌లో విలీనమైన 22 ఏళ్లు
డెల్టా ప్రాంతానికి జాతీయ రహదారి అవసరం ఎంతైనా ఉంది. ఎన్‌హెచ్–165 అభివృద్ధికి రాజకీయలు, స్వార్థ ప్ర యోజనాలు తగదు. అడ్డంకుల్ని తొలగించి తక్షణం డీపీఆర్‌ను రూపొందించి అమలుజేయాలి. పారిశ్రామికంగా అభివృద్ధి సాధించాలంటే జాతీయ రహదారులు అభివృద్ధి చెందాలి.
– ముదునూరి మురళీకృష్ణంరాజు,
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నరసాపురం పార్లమెంట్ పరిశీలకుడు
ఉండి నియోజకవర్గంలో రాష్ట్ర, కేంద్ర రహదారులు అధ్వానంగా ఉన్నాయి. రోడ్ల విస్తరణ, అభివృద్ధి జరగాల్సి ఉంది. ఏళ్ల తరబడి ఎన్ హెచ్ 165 ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుగా మారింది. రైతులు స్వచ్ఛందంగా భూమిని ఇచ్చినా ఉప్పుటేరు నుంచి అజ్జమూరు వరకు రోడ్డు పనులు ప్రారంభించలేదు.
– మంతెన యోగీంద్రకుమార్ (బాబు),
వైఎస్సార్‌సీపీ ఉండి నియోజకవర్గ ఇన్ చార్జి


