పెనుగొండ: ప్రధాన రహదారుల్లో గుంతల పూడికలో నాణ్యత లోపించడంతో మరమ్మతులు మూన్నాళ్ల ముచ్చటగా మారుతున్నాయి. దీంతో వాహనదారుల అవస్థలు పునరావృతం అవుతున్నాయి. పెనుగొండ నుంచి 216వ జాతీయ రహదారి వరకూ ఇటీవలే రోడ్డుపై గోతులను పూడ్చారు. గుంతలు లేని రహదారులంటూ హడావుడి చేశారు. కనీసం మూడు నెలలు కాకుండా మరలా రోడ్డుపై గోతులు పడటంతో మరమ్మతుల్లో నాణ్యత డొల్ల స్పష్టంగా కనిపిస్తోంది. కోనసీమ అంబేడ్కర్ జిల్లా నుంచి పశ్చిమగోదావరి జిల్లాలోకి ప్రవేశించే ముఖ ద్వారం వద్దే ఏర్పడిన భారీ గొయ్యి ప్రమాదాలను నిలయంగా మారింది. జాతీయ రహదారి నుంచి ఏమాత్రం గమనించకుండా లింక్ రోడ్డువైపు దిగినా అంతే సంగతులు. ఇక్కడ ద్విచక్రవాహనాలు బోల్తా పడుతుండగా.. కారులు గోతుల్లో నిలిచిపోతున్నాయి. రామన్నపాలెం వద్ద సైతం రోడ్డుపై గోతులు ఏర్పడటంతో వాహనాలు అప్రమత్తంగా వెళ్లాల్సిన పరిస్థితి. చినుకు పడితే ఈ రోడ్డుపై అవస్థలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. అలాగే పెనుగొండ శివారునా ఇదే పరిిస్థితి నెలకొంది. నిత్యం వందలాది వాహనాలు ఇటుగా రాకపోకలు సాగిస్తుంటాయి. ముఖ్యంగా తూర్పుగోదారి, కోనసీమ అంబేడ్కర్ జిల్లాలకు భీమవరం, నరసాపురం, పెనుమంట్ర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. పెనుగొండ ఎస్వీకేపీ విద్యాసంస్థల్లో విధ్యనభ్యసించడానికి వందలాది మంది విద్యార్థులు ఆర్టీసీ బస్సులు, మో టారు సైకిళ్లుపై వస్తుంటారు. భారీ గోతులతో ఇబ్బందులు పడుతున్నామంటూ వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇప్పటికై నా స్పందించి రహదారుల మరమ్మతుల్లో నాణ్యత పాటించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
మరమ్మతుల్లో డొల్లతనంతో ఏర్పడిన గొయ్యి
రామన్నపాలెం వద్ద రోడ్డు దుస్థితి


