అత్తిలి: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 60 శాతం మంది బీసీ జనాభాకు అనుగుణంగా ఉద్యోగాల్లో రిజర్వేషన్ల శాతాన్ని పెంచాలని బీసీ, ఓబీసీ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు వీరవల్లి వీరబ్రహ్మం అన్నారు. అత్తిలి లయన్స్ క్లబ్‌లో ఆదివారం సంఘ మొదటి జిల్లా సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రంలో ఆరు లక్షల మంది బీసీ ఉద్యోగులు ఉన్నారని, వారి సమస్యల పరిష్కారం కోసం ఐకమత్యంగా కృషి చేస్తామన్నారు. బీసీలకు క్రిమిలేయర్‌ను రద్దు చేయాలని, పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. ఏప్రిల్ 11న జ్యోతిరావు పూలే జయంతిని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలని, జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలేలకు భారతరత్న ఇచ్చేలా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కృషి చేయాలన్నారు. బీసీ ఉద్యోగులకు స్థలాలు కేటాయించాలని, కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో బీసీ భవనాలు నిర్మించాలని, పూలే విగ్రహాలను ఏర్పాటు చేయాలని కోరారు. జిల్లా అధ్యక్షుడు వీరవల్లి రమేష్ మాట్లాడుతూ సంఘం తరఫున ఉద్యోగులకు ఐఆర్, పీఆర్సీ డీఏ బకాయిలు, సీసీఎస్ రద్దు వంటి సమస్యలపై వినతిపత్రాలు అందించనున్నట్టు చెప్పారు. బీసీలు రాజకీయ శక్తిగా ఎదగాలని రాష్ట్ర కౌన్సిలర్ టి.గణపతి అన్నారు. బీసీల్లో ఐక్యత లేకపోవటం వల్లే ప్రభు త్వం పట్టించుకోవడం లేదన్నారు. బీసీల ఐక్యత కోసం రాష్ట్ర సంఘ అధ్యక్షుడు వీరబ్రహ్మం విశేష కృషి చేశారని కేవీ రామారావు అన్నారు. బీసీలు అన్నిరంగాల్లో పురోగతి సాధించాలని జిల్లా ఉపవిద్యాశాఖధికారి ఎన్.రమేష్ అన్నారు. జిల్లా సంఘ ప్రధాన కార్యదర్శి వారధి వెంకట రమణారావు, కె.కృష్ణారావు, పంపన కుమారస్వామి, కె.రాజా, వర్కింగ్ ప్రెసిడెంట్ తానంకి శ్రీనివాస్, కె.శాంతారావు,, గుబ్బల రాధాకృష్ణ తదితరులు మాట్లాడారు. సంఘ జిల్లా గౌరవాధ్యక్షుడు కె.కృష్ణారావు అధ్యక్షత వహించారు. జిల్లా కౌన్సిల్ సభ్యుడు టెక్కలి గణపతి, జిల్లా నలుమూలల నుండి అధిక సంఖ్యలో బీసీ ఉద్యోగులు తరలి వచ్చారు.


