పసిబాల్యం.. భిక్షాటనలో ఛిద్రం | - | Sakshi
Sakshi News home page

పసిబాల్యం.. భిక్షాటనలో ఛిద్రం

Aug 24 2026 1:19 AM | Updated on Aug 24 2026 1:19 AM

ద్వారకాతిరుమల: పసిపిల్లల చేతుల్లో పుస్తకాలు.. బొమ్మలు ఉండాలి. తల్లిదండ్రుల చేతుల్లో భద్రంగా ఆడుకోవాలి. కానీ ద్వారకాతిరుమల చినవెంకన్న క్షేత్రంలో కొందరు చిన్నారులు తల్లుల చేతుల్లో భిక్షాపాత్రలుగా మారుతున్నారు. ఎండ మండుతున్నా.. వాన కురుస్తున్నా.. పసి పిల్లలను ఎత్తుకుని ఆలయ పరిసరాల్లో భిక్షాటన సాగిస్తున్నారు. దర్శనానికి వచ్చే భక్తుల వెంటపడి డబ్బులు అడుగుతున్నారు. ఇవ్వకపోతే కొందరు దూషణలకు దిగుతున్నారు. సానుభూతిని సొమ్ము చేసుకునేందుకు పసి బిడ్డలనే పావులుగా మార్చేస్తున్న ఈ దృశ్యాలు.. క్షేత్రంలో నిత్యం మన కళ్లముందే కనిపిస్తున్నాయి.

భక్తులే టార్గెట్‌.. పిల్లలే అడ్డం

శ్రీవారి దర్శనానికి నిత్యం వేలాదిమంది భక్తులు వస్తుంటారు. ఇదే అదనుగా కొందరు యాచకులు పిల్లలను ఎత్తుకుని భక్తుల వెంట తిరుగుతున్నారు. చిన్నారులను చూపిస్తూ డబ్బులు అడుగుతున్నారు. ఒక భక్తుడు ఇవ్వకపోతే మరో భక్తుడి వెంటపడుతున్నారు. కొందరు పదేపదే అడుగుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని భక్తులు వాపోతున్నారు. డబ్బులు ఇవ్వకపోతే నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని చెబుతున్నారు.

ఎండ.. వాన.. రక్షణేది?

పసిపిల్లలను గంటల తరబడి ఎండలో తిప్పడం.. వర్షంలో తడపడం.. రద్దీ ప్రాంతాల్లోకి తీసుకెళ్లడం వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది. పాలు తాగే వయసున్న చిన్నారుల నుంచి కొద్దిగా ఎదిగిన పిల్లల వరకు ఈ భిక్షాటనలో కనిపిస్తున్నారు. ఆ పిల్లలకు విశ్రాంతి ఉందా? సరైన ఆహారం అందుతోందా? పాఠశాలకు వెళ్తున్నారా? అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.

చట్టం కఠినంగా ఉన్నా..

పిల్లలను భిక్షాటన కోసం ఉపయోగించడం సాధారణ విషయం కాదు. జువైనెల్‌ జస్టిస్‌ (కేర్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌) యాక్ట్‌–2015 లోని సెక్షన్‌ 76 ప్రకారం పిల్లలను భిక్షాటనకు ఉపయోగించినా, వారితో భిక్షాటన చేయించినా ఐదేళ్ల వరకు జైలు శిక్ష, రూ.లక్ష వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. భిక్షాటన కోసం చిన్నారిని అంగవైకల్యానికి గురిచేయడం వంటి తీవ్రమైన చర్యలకు పాల్పడితే ఏడేళ్ల నుంచి పదేళ్ల వరకు కఠిన కారాగార శిక్ష, రూ.5 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.

పిల్లలను రక్షించాల్సిన బాధ్యత ఎవరిది?

భిక్షాటనలో కనిపించే చిన్నారులను కేవలం అక్కడి నుంచి తరిమేయడం పరిష్కారం కాదు. వారి పరిస్థితిని పరిశీలించి రక్షణ, పునరావాసం కల్పించాలి. ఇందుకోసం స్థానిక పోలీసులు, చైల్డ్‌ వెల్ఫేర్‌ అధికారులు, జిల్లా చైల్డ్‌ ప్రొటెక్షన్‌ యూనిట్‌ (డీసీపీయూ), చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ (సీడబ్ల్యూసీ), మహిళా–శిశు సంక్షేమ శాఖ సమన్వయంతో చర్యలు తీసుకోవాలి. పిల్లలు ప్రమాదంలో ఉన్నట్లు కనిపిస్తే ఎవరైనా చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ 1098కు సమాచారం ఇవ్వొచ్చు.

ఆలయ పరిసరాల్లో ప్రత్యేక డ్రైవ్‌ ఏదీ?

ద్వారకాతిరుమల వంటి ప్రముఖ పుణ్యక్షేత్రంలో పిల్లలను అడ్డం పెట్టుకుని భిక్షాటన సాగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం పట్ల భక్తులు మండిపడుతున్నారు. ఆలయ పరిసరాలు, ఘాట్‌ రోడ్లు, పార్కింగ్‌ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టి చిన్నారులతో భిక్షాటన చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

అవగాహన కల్పించాలి

పసిబిడ్డలను ఎత్తుకుని భక్తుల ముందు నిలబడటం ద్వారా వచ్చే ప్రతి రూపాయి వెనుక ఒక చిన్నారి బాల్యం దాగి ఉంది. సానుభూతి పేరుతో డబ్బులు ఇవ్వడం కన్నా.. చిన్నారి భిక్షాటనలో కనిపిస్తే 1098 కు సమాచారం ఇవ్వడం మేలని అధికారులు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా ఈ టోల్‌ఫ్రీ నెంబర్‌కు సంబంధించిన ఫ్లెక్సీలు, బోర్డులను క్షేత్రంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తే కొంత మేరకు సత్ఫలితాలు రావొచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ద్వారకాతిరుమల శ్రీవారి క్షేత్రంలో పసిపిల్లలతో తల్లుల భిక్షాటన

ఎండైనా.. వానైనా.. పిల్లలను ఎత్తుకుని భక్తుల వెంట యాచన

డబ్బులివ్వకుంటే దూషణలు.. చిన్నారుల భద్రత పట్టని వైనం

నిఘా పెట్టాల్సిన అధికారులెక్కడ?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement