భీమవరం: విద్యార్థి విజ్ఞాన్ మంథన్ (వీవీఎం) పోటీలో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులు పాల్గొనాలని డీఈఓ ఓవీఎస్ అనిల్‌కుమార్ తెలిపారు. వీవీఎం పరీక్షల పోస్టర్‌ను శుక్రవారం కలెక్టరేట్‌లోని విద్యాశాఖ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ, జాతీయ విద్యా పరిశోధన మండలి, జాతీయ సైన్స్ మ్యూజియం, విజ్ఞాన భారతి సంయుక్తంగా పోటీలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. పోటీలకు ప్రభుత్వ పాఠశాలలోని ప్రతి తరగతి నుంచి కనీసం ఇద్దరు విద్యార్థులు నమోదు చేసుకునేలా ప్రోత్సహించాలని కోరారు. వీవీఎం జిల్లా కో–ఆర్డినేటర్ రేపాక వెంకన్నబాబు మాట్లాడుతూ సెప్టెంబర్ 30లోపు విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, మరిన్ని వివరాలకు సెల్ 98496 66417లో సంప్రదించాలని కోరారు. విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఈ.నారాయణ, భీమవరం ఎంఈఓలు ఎన్.శ్రీనివాసరావు, కేఎస్‌సీహెచ్ సాయిరాం, వీవీఎం జిల్లా జాయింట్ కో–ఆర్డినేటర్ మల్లుల శ్రీనివాస్, టెక్నికల్ కో–ఆర్డినేటర్ సయ్యద్ షహింషా పాల్గొన్నారు.
పెనుమంట్ర: ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా నిర్వహించే వ్యవసాయ డిప్లొమా కోర్సులకు మాన్యువల్ స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడీఆర్ సీహెచ్ శ్రీనివాస్ తెలిపారు. 2026–27 విద్యా సంవత్సరానికి గాను ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో మిగిలి ఉన్న సీట్లను భర్తీ చేసే నిమిత్తం, జోనల్ స్థాయిలో స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారన్నారు. గోదావరి మండలానికి సంబంధించి ఈనెల 27న తమ పరిశోధనా స్థానంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. యూనివర్సిటీ పాలిటెక్నిక్‌లు మారుటేరు, రంపచోడవరం, ప్రైవేటు వ్యవసాయ పాలిటెక్నిక్‌లు కొయ్యలగూడెం, పాలకొల్లు, కాకినాడ, ద్రాక్షారామం, మూలపాలెంలో మిగిలిన సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. మరిన్ని వివరాలకు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, మారుటేరు లేదా వ్యవసాయ పాలిటెక్నిక్, మారుటేరు కార్యాలయ పనివేళల్లో సంప్రదించాలని కోరారు.
తణుకు అర్బన్: తణుకు మున్సిపల్ స్కేటింగ్ రింక్‌లో ఈనెల 30న ఎన్‌డ్యూరెన్స్ స్కేటింగ్ జిల్లాస్థాయి సెలెక్షన్స్ నిర్వహించనున్నట్లు స్కేటింగ్ కోచ్ వి.లావణ్య తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు ఈనెల 25లోపు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, వివరాలకు 96423 31332లో సంప్రదించాలని కోరారు.


