ముదినేపల్లి(కై కలూరు): చిట్టీ డబ్బులు తిరిగి ఇవ్వడం లేదనే కోపంతో ఓ వ్యక్తిపై దాడి చేసిన ఘటనపై ఎస్సై వీరభద్రరావు శుక్రవారం కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం వడాలి గ్రామంలో కొబ్బరికాయల వ్యాపారం చేసే మరీదు ధర్మారావు భార్య గతంలో చిట్టీల వ్యాపారం నిర్వహించింది. కొందరు సభ్యులు చందాలు చెల్లించకపోవడంతో గ్రూపులను నిలిపివేసింది. అదే గ్రామానికి చెందిన నారగాని గంగమ్మ తనకు రావాల్సిన డబ్బుల కోసం కోర్టును ఆశ్రయించడమే కాకుండా తరచూ ధర్మారావు దంపతులతో గొడవపడేది. ఒత్తిడి తట్టుకోలేక ధర్మారావు భార్య ఐదు రోజుల క్రితం ఇంట్లోంచి వెళ్లిపోగా, ఆమె విశాఖపట్నంలో ఉన్నట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. కాగా, గురువారం గంగమ్మ మరో వ్యక్తితో కలిసి ధర్మారావు ఇంటికి వెళ్లే గొడవకు దిగింది. ఈ క్రమంలో గంగమ్మ ధర్మారావు చూపుడు వేలు కొరకడంతో పాటు, తలపై దాడి చేయడంతో తీవ్ర రక్తగాయమైంది. బాధితుడిని గుడివాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆస్పత్రి నుంచి వచ్చిన సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆకివీడు: ఆకివీడు సమీపంలోని ఉప్పుటేరు గట్టుపై ఈ నెల 15న లభ్యమైన మహిళ మృతదేహం భీమవరం ప్రాంతానికి చెందినదిగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. వారం రోజులుగా మృతదేహాన్ని గుర్తించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో, బంధువులే హత్య చేసి ఉంటారని అనుమానించారు. పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి సరిహద్దు జిల్లాల పోలీసు స్టేషన్లకు ఆమె ఫొటోలు పంపించి విచారణ జరిపారు. ఎట్టకేలకు అందిన సమాచారంతో ఆమెను భీమవరం వాసిగా నిర్ధారించుకున్నారు. మృతదేహాన్ని మినీ వ్యాన్ లేదా కారులో తీసుకొచ్చారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.


