బుట్టాయగూడెం: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కోసం చేస్తున్న భూసేకరణపై సీబీఐ, సిట్‌తో సమగ్ర విచారణ జరిపించాలని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు డిమాండ్ చేశారు. మండలంలోని దుద్దుకూరులో గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కోసం సేకరిస్తున్న భూముల విషయంలో అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయని అన్నారు. గిరిజన బాధితులు గొంతెత్తి తమకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నా పట్టించుకునే నాధుడే కరువయ్యాడన్నారు. ముఖ్యంగా భూ సేకరణలో కూటమి నాయకులు కనుసైగల్లోనే అధికారుల అండదండలతో జరుగుతున్నాయని ఆరోపించారు. భూముల్లో గిరిజనులు ఉంటే హక్కుదారులుగా వేరేవాళ్లని చూపించి వారికి పరిహారం సొమ్ము జమ చేస్తున్నారని అనేక మంది బాధితులు తన వద్ద వాపోతున్నారని తెలిపారు. ముఖ్యంగా వేలేరుపాడు, కుక్కునూరు, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో భూసేకరణలో దళారుల బెడద ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుందని అన్నారు. భూసేకరణకు భూములు ఇస్తున్న రైతుల నుంచి ఖాళీ చెక్‌లను తీసుకుని సొమ్ములు వారి ఖాతాలో పడే సమయానికి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలుస్తుందని చెప్పారు. దీనివల్ల భూములిచ్చిన రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. బాధితులకు అండగా తమ పార్టీ వైఎస్సార్ సీపీ ఉంటుందని చెప్పారు. ఈ భూసేకరణపై జరిగే అవినీతి అక్రమాలపై నిగ్గు తేల్చే వరకూ పోరాటం చేస్తామని చెప్పారు. అలాగే ఈ వ్యవహారాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి కూడా తీసుకువెళ్తానని తెలిపారు. భూ యజమానులు ఎవ్వరూ కూడా దళారులకు ఒక్క రూపాయి చెల్లించవద్దన్నారు. భూ సేకరణలో అక్రమాలు చోటు చేసుకుంటున్నట్లు పత్రికల్లో, టీవీ ఛానళ్లలో వస్తున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కనీసం నోరు మెదపకపోవడం బాధాకరమని అన్నారు. వారు ఇప్పటికై నా భూములిచ్చే రైతులకు అండగా నిలవాలని కోరారు.


