దోమకాటు.. ఆరోగ్యానికి చేటు | - | Sakshi
Sakshi News home page

దోమకాటు.. ఆరోగ్యానికి చేటు

Aug 20 2026 7:32 AM | Updated on Aug 20 2026 7:32 AM

దోమకాటు.. ఆరోగ్యానికి చేటు

వ్యాధులపై ప్రజలను చైతన్యం చేస్తున్నాం

పరిసరాల పరిశుభ్రత పాటించాలి

పల్లెల్లో విజృంభిస్తున్న వ్యాధులు

నేడు ‘ప్రపంచ దోమల దినోత్సవం’

భీమడోలు: ఆకారం చిన్నదే అయినా దోమకాటు ప్రాణాంతకం. వాతావరణ మార్పులు, పారిశుద్ధ్య లోపం కారణంగా పల్లెల్లో దోమలు విజృంభిస్తున్నాయి. ఫలితంగా ఆస్పత్రుల్లో జ్వరపీడితుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గతంలో నిర్వహించిన ఇంటింటి ఆరోగ్య సర్వేలు, డ్రై ఫ్రైడే వంటి కార్యక్రమాలపై ప్రస్తుత ప్రభుత్వం దృష్టి సారించకపోవడం ప్రజలు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. దాడులు, హత్యల కంటే దోమల ద్వారా వ్యాపించే రోగాలతోనే ఎక్కువ మంది మృత్యువాత పడుతుండటం గమనార్హం. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో వర్షాకాలం వచ్చిదంటే ఇంటింటికీ వైద్య ఆరోగ్య సిబ్బంది, సచివాలయ, వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితిపై సర్వే చేసి ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకునేవారు. ప్రస్తుతం గ్రామాల్లో ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. ఆడ అనాఫిలిస్‌ దోమ వల్లే మలేరియా వ్యాపిస్తుందని 1897 ఆగస్టు 20న సర్‌ రొనాల్డ్‌ రాస్‌ కనుగొన్నారు. దీనికి గుర్తుగా ప్రతి ఏటా ఆగస్టు 20న ‘ప్రపంచ దోమల దినోత్సవం’ జరుపుకుంటారు.

దోమకాటు వల్ల వచ్చే వ్యాధులు

మలేరియా : ఆడ అనాఫిలిస్‌ దోమ వల్ల వస్తుంది. చలి, వణుకుతో కూడిన జ్వరం వస్తుంది.

డెంగీ : పగటిపూట కుట్టే ఏడీస్‌ దోమల వల్ల సోకుతుంది. హఠాత్తుగా తీవ్ర జ్వరం, కీళ్ల నొప్పులు, ప్లేట్‌లెట్స్‌ పడిపోవడం, దద్దుర్లు, ముక్కు లేదా చిగుళ్ల నుంచి రక్తం కారడం దీని లక్షణాలు.

మెదడువాపు : క్యూలెక్స్‌ దోమల వల్ల ముఖ్యంగా 2–14 ఏళ్ల లోపు పిల్లల్లో వస్తుంది. ఆకస్మిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, వాంతులు, మూర్చ, పక్షవాతం ప్రధాన లక్షణాలు.

చికెన్‌గున్యా : ఏడీస్‌ ఈజిప్ట్‌ దోమల వల్ల వస్తుంది. జ్వరం, కనీసం అడుగు తీసి వేయలేని స్థాయిలో భరించలేని కీళ్ల నొప్పులు ఉంటాయి.

ఫైలేరియా (బోదకాలు) : క్యూలెక్స్‌ దోమ వల్ల వ్యాపిస్తుంది. తరచూ జ్వరం రావడం, కాళ్లు, చేతులు వంటి అవయవాల్లో వాపు (బిళ్లలు కట్టడం) వస్తుంది.

దోమల నివారణ చర్యలు

దోమల నివారణకు చర్మానికి యూకలిప్టస్‌, లెమన్‌ ఆయిల్‌ రాసుకోవచ్చు. వీటిలోని సినోల్‌ రసాయనం కీటక నివారణిగా పనిచేస్తుంది. అలాగే, చీకటి పడే సమయంలో తలుపులు మూసి ఇంట్లో కర్పూరం వెలిగించడం ద్వారా దోమలను అరికట్టవచ్చు.

వర్షాకాలలో దోమల కుట్టడం ద్వారా జ్వరాలు బారిన పడుతుంటారు. దోమల వల్ల వ్యాపించే వ్యాధులను నియంత్రణకు కృషి చేస్తున్నాం. గ్రామాల్లో అవగాహన ర్యాలీలు, కరపత్రాలను అందించి ప్రజలను చైతన్యవంతం చేస్తున్నాం. పరిసరాల్లో నీటి నిల్వలు తొలగించాలి. ప్రతి ఒక్కరూ ఇళ్లల్లో దోమ తెరలు వాడాలి.

– జి.గోవిందరావు, జిల్లా సహాయ మలేరియా అధికారి, ఏలూరు

దోమల వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతిఒక్కరూ పరిసరాల పరిశుభ్రతపై దృష్టిని సారించాలి. ప్రతి ఇంటి వద్ద వారానికోకసారి ఫ్రైడే–డ్రైడే పాటిస్తే దోమల నియంత్రం సాధ్యమవుతుంది. దోమల నివారణ మనందరి బాధ్యత. పంచాయతీ అధికారుల సహకారంతో దోమలు ఎక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించి అక్కడ కీటక నియంత్రణ చర్యలు చేపడుతున్నాం.

– డాక్టర్‌ పి.జాహ్నవి, వైద్యాధికారిణి, పీహెచ్‌సీ, గుండుగొలను

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement