మద్యం మత్తులో లారీతో ఇల్లును ఢీకొట్టిన డ్రైవర్‌ | - | Sakshi
Sakshi News home page

మద్యం మత్తులో లారీతో ఇల్లును ఢీకొట్టిన డ్రైవర్‌

Aug 20 2026 7:32 AM | Updated on Aug 20 2026 7:32 AM

మద్యం మత్తులో లారీతో ఇల్లును ఢీకొట్టిన డ్రైవర్‌ పాము కాటుతో వ్యక్తి మృతి సీసీ కెమెరా వైర్లు కత్తిరించి చోరీ రెస్టారెంట్‌ యజమానిపై దాడి కేసులో ఐదుగురి అరెస్ట్‌ విద్యార్థులకు లేఖ రచన పోటీలు రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

నూజివీడు: మండలంలోని యనమదల శివారు రేగుంటలో మంగళవారం రాత్రి తాగి వాహనం నడిపిన ఒక లారీ డ్రైవర్‌ తీవ్ర కలకలం సృష్టించాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గారపాటి తంబీ లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి 10:30 గంటల సమయంలో పూటుగా మద్యం సేవించి లారీతో సెంటర్‌లోని బడ్డీ కొట్టు పందిరిని, పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టాడు. అనంతరం లారీ సమీపంలోని పెండెం శ్రీకాంత్‌ ఇంటి ఆవరణలోకి దూసుకెళ్లింది. అయితే కుడివైపు ముందు చక్రం కాలువలో పడిపోవడంతో లారీ అక్కడే ఆగిపోయింది. ఘటనా సమయంలో ఇంట్లోని వారంతా లోపలికి వెళ్లడంతో ప్రమాదం తప్పిందని, కాలువలో పడకపోతే లారీ నేరుగా బాత్‌రూమ్‌లను ఢీకొట్టేదని ఊపిరి పీల్చుకున్నారు. నిర్ల క్ష్యంగా వ్యవహరించిన డ్రైవర్‌ను నిలదీయగా బాధ్యతారాహిత్యంగా సమాధానమిచ్చినట్లు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచా రం అందుకున్న రూరల్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.

టి. నరసాపురం: పాము కాటుకు గురై చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన టి. నరసాపురం మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొరివి రామన్నపాలెం పుట్టగట్టు గ్రామానికి చెందిన కూలీ గంటా మంగయ్యను ఈ నెల 12న రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా రక్తపింజర పాము కరిచింది. మొదట స్థానికంగా నాటు వైద్యం చేయించినప్పటికీ పరిస్థితి విషమించడంతో 14న ఏలూరు, ఆపై విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. అనంతరం విజయవాడలోని ప్రైవేటు ఆసుపత్రికి మార్చగా, అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం మృతి చెందాడు. మృతుడి భార్య నాగమణి ఫిర్యాదు మేరకు హెచ్‌సీ జయరాజు బుధవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

దెందులూరు: చోరీ ఉదంతం బయటపడకుండా సీసీ కెమెరా వైర్లను కత్తిరించి ఓ ఇంట్లో దొంగతనానికి పాల్పడిన సంఘటన జోగన్నపాలెంలో చోటు చేసుకుంది. ఎస్సై డి.వెంకట్‌ కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన కే.విజయరాణి ఈ నెల 5న ఇంటికి తాళం వేసి, ఆ తాళాలను కుమారుడైన రవిచంద్రకు ఇచ్చి హైదరాబాద్‌ వెళ్లారు. ఈ నెల 19న పనిమనిషి శుభ్రం చేయడానికి రాగా, ఇంటి తలుపులు పగులగొట్టి ఉండడాన్ని గమనించి పక్కనే ఉన్న రవిచంద్రకు సమాచారం అందించింది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంట్లోని ఇన్వర్టర్‌, బ్యాటరీ, మిక్సీ సహా సుమారు రూ10,000 విలువైన వస్తువులు చోరీకి గురైనట్లు గుర్తించి దర్యాప్తు చేపడుతున్నారు.

ఆగిరిపల్లి: స్థానిక ఎస్‌ఎస్‌ రెస్టారెంట్‌ యజమాని శ్రీనివాసరావు, ఆయన కుమారుడు, సిబ్బందిపై దాడి చేసిన ఐదుగురు వ్యక్తులను బుధవారం సాయంత్రం అరెస్టు చేసినట్లు ఎస్సై నాగరాజు తెలిపారు. మంగళవారం బిర్యానీ కొనుగోలు విషయమై తలెత్తిన వివాదంలో ఈ దాడి జరిగింది. నూజివీడు రూరల్‌ సీఐ నాగేంద్రకుమార్‌ ఆధ్వర్యంలో సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా నిందితులను గుర్తించినట్లు చెప్పారు. పోతవరప్పాడు గ్రామానికి చెందిన ఆ ఐదుగురినీ అరెస్ట్‌ చేసి నూజివీడు కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్సై వెల్లడించారు.

భీమవరం: తపాలా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు డాయ్‌ అఖర్‌ పేరిట జాతీయ స్థాయి లేఖ రచన పోటీలు నిర్వహిస్తున్నట్లు భీమవరం పోస్టాఫీసు సీనియర్‌ సూపరింటెండెంట్‌ కె.హరి కృష్ణప్రసాద్‌ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. 18 ఏళ్లలోపు విద్యార్థులు ఎన్వలప్‌, ఇన్‌ల్యాండ్‌ లెటర్‌ కార్డ్‌ విభాగాల్లో పోటీ పడవచ్చని పేర్కొన్నారు. విజేతలకు జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో నగదు బహుమతులు అందజేస్తారని వివరించారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు తమ రచనలను అక్టోబర్‌ 31లోపు సీనియర్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోస్టాఫీసెస్‌, భీమవరం డివిజన్‌, భీమవరం–534210 చిరునామాకు స్పీడ్‌పోస్ట్‌ ద్వారా పంపాలని సూచించారు.

కాళ్ల: మండలంలోని పెదఅమిరంలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్సై గణేష్‌ కుమార్‌ తెలిపారు. అస్సాం రాష్ట్రానికి చెందిన రాకేష్‌ లగాచు (19) చినఅమీరంలోని కార్‌ సర్వీసింగ్‌ సెంటర్‌లో పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి తన బైక్‌పై పెదఅమిరం వైపు వస్తుండగా హెల్త్‌ క్లినిక్‌ వద్ద బైక్‌ అదుపుతప్పి, రోడ్డు పక్కన గోడ వద్ద ఉన్న వేరో మోటార్‌ సైకిల్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయమై రాకేష్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సహచర ఉద్యోగి వంటాబత్తిన శామ్యూల్‌ ప్రకాష్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement