భీమవరం: దళితులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 24న చలో కలెక్టరేట్ పేరుతో ధర్నా నిర్వహిస్తున్నట్లు కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.క్రాంతిబాబు తెలిపారు. మంగళవారం భీమవరంలో కేవీపీఎస్, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 80 శాతం దళిత వాడలకు శ్మశానవాటికలు లేవని, ఉన్నవి కూడా ఆక్రమణలకు గురయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. శ్మశానవాటిక సమస్య తెలిసేలా శవపేటిక ప్రదర్శన చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు బత్తుల విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
భీమవరం: ఖరీఫ్ సీజన్‌లో రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ కేఆర్ కల్పశ్రీ అధికారులను ఆదేశించారు. మంగళవారం భీమవరం కలెక్టరేట్‌లో జిల్లా ప్రొక్యూర్‌మెంట్ కమిటీ సభ్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మౌలిక సదుపాయాలు, రవాణా, గన్నీ బ్యాగుల లభ్యతపై సమగ్రంగా చర్చించారు. సమావేశంలో సివిల్ సప్లైస్ మేనేజర్ ఎండీ ఇబ్రహీం, డీఎస్‌ఓ ఎన్.సరోజ, జిల్లా వ్యవసాయాధికారి జెడ్. వెంకటేశ్వరరావు, ఆర్టీఓ కేఎస్‌ఎంవీ కృష్ణారావు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
భీమవరం (ప్రకాశంచౌక్): జర్మనీ జాబ్ ఆపర్చునిటీ ప్రోగ్రామ్ ద్వారా ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు జర్మనీలో నర్సింగ్ ఉద్యోగాల కోసం ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి డాక్టర్ పి.లోకమాన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకంలో భాగంగా విశాఖ, తిరుపతి, గుంటూరు కేంద్రాల్లో అభ్యర్థులకు జర్మన్ భాషలో రెండు లెవెల్స్ వరకు ఉచితంగా శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు.. 8 నుంచి 10 నెలల పాటు సాగే ఈ శిక్షణను పూర్తి చేసుకున్న వారికి జర్మనీలో ఉద్యోగావకాశాలు కల్పిస్తారని వివరించారు. ఎంపికైన వారు నెలకు రూ.2.75 లక్షల నుంచి రూ.3.30 లక్షల వరకు వేతనం పొందే అవకాశం ఉందని స్పష్టం చేశారు. 18 నుంచి 35 ఏళ్ల లోపు వయసు ఉండి, బీఎస్సీ నర్సింగ్, ఏఎన్‌ఎం లేదా జీఎన్‌ఎం పూర్తి చేసిన వారు ఇందుకు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని, పూర్తి వివరాల కోసం 86885 94244 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు.
యలమంచిలి: పాలకొల్లు పట్టణంలోని శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామివారిని మయన్మార్‌లో భారత డిప్యూటీ అంబాసిడర్‌గా (యాంగోన్) పనిచేస్తున్న ఐఎఫ్‌ఎస్ అధికారి బుడిగి శ్రీనివాసులరెడ్డి మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు ఆయనను స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. అనంతరం ప్రధాన అర్చకులు అనిల్ కుమార్, వీరబాబు వేద ఆశీర్వచనం పలికి, తీర్థప్రసాదాలు అందజేశారు.
దెందులూరు: చైనాలోని జియాన్ నగరంలో ఈ నెల 19 నుంచి 22 వరకు జరగనున్న ‘ఇసు ప్రిక్స్–2026 ఇంటర్నేషనల్ జూనియర్ గ్రాండ్ స్కేటింగ్’ పోటీలకు జోగన్నపాలేనికి చెందిన అంతర్జాతీయ స్కేటర్, విద్యార్థి మాత్రపు జెస్సీరాజ్ ఎంపికైంది. ఈ వివరాలను ఐఎస్‌ఈ స్కేటింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ పోటీల్లో పాల్గొనేందుకు జెస్సీరాజ్ ఇప్పటికే చైనా బయలుదేరి వెళ్లింది.


