ఐదో విద్యార్థి మృతదేహం లభ్యం | - | Sakshi
Sakshi News home page

ఐదో విద్యార్థి మృతదేహం లభ్యం

Aug 19 2026 12:54 AM | Updated on Aug 19 2026 12:54 AM

పెనుగొండ: ఇరగవరం మండలం అయితంపూడి వద్ద నరసాపురం కాలువలో కారు బోల్తా పడిన ఘటనలో గల్లంతైన ఐదో విద్యార్థి మృతదేహం ఎట్టకేలకు లభ్యమైంది. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మోరి గ్రామానికి చెందిన చెరుకూరి రామచరణ్‌ మృతదేహాన్ని మంగళవారం మధ్యాహ్నం పెనుగొండ వద్ద గుర్తించారు. ఈ నెల 16న తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు యువకులు గల్లంతవ్వగా, నలుగురి మృతదేహాలు అదే రోజు సాయంత్రానికి లభ్యమైన విషయం తెలిసిందే. రామచరణ్‌ ఆచూకీ కోసం తణుకు సీఐ దేశంశెట్టి వెంకటేశ్వరరావు, ఇరగవరం ఎస్సై నసీరుల్లా ఆధ్వర్యంలో పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు అయితంపూడి నుంచి నరసాపురం వరకు సుమారు 30 కిలోమీటర్ల మేర రెండు రోజుల పాటు నిర్విరామంగా గాలింపు చర్యలు చేపట్టారు. మంగళవారం ఓ కానిస్టేబుల్‌ పెనుగొండ వద్ద కాలువలో చెట్టు కొమ్మల మధ్య ఇరుక్కున్న మృతదేహాన్ని గుర్తించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న సహాయక బృందాలు మృతదేహాన్ని వెలుపలికి తీశాయి. తండ్రి దుర్గాప్రసాద్‌, బంధువులు అది రామచరణ్‌ దేహంగా నిర్ధారించడంతో, పోస్టుమార్టం నిమిత్తం తణుకు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

శోకసంద్రంలో కుటుంబ సభ్యులు

రెండు రోజులుగా నీటిలోనే ఉండిపోవడంతో రామచరణ్‌ మృతదేహం ఉబ్బిపోయి, గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. కొడుకు కోసం నిద్రాహారాలు మాని సహాయక చర్యల్లో పాల్గొన్న తండ్రి దుర్గాప్రసాద్‌ విగతజీవిగా మారిన కుమారుడిని చూసి కన్నీరుమున్నీరుగా విలపించాడు. బంధువుల రోధనలతో పెనుగొండ–మార్టేరు రహదారిపై తీవ్ర విషాదం అలముకుంది. రామచరణ్‌ తండ్రి దుర్గాప్రసాద్‌ గల్ఫ్‌ దేశంలో ఉపాధి పొందుతూ, ఇటీవలే సెలవుపై స్వగ్రామానికి వచ్చారు. రామచరణ్‌ను సూరంపాలెంలోని ఆదిత్య యూనివర్సిటీలో బీటెక్‌ మొదటి సంవత్సరంలో చేర్పించారు. బుధవారం నుంచే తరగతులు ప్రారంభం కావాల్సి ఉండగా ఇంతలోనే ఈ ఘోరం జరిగింది.

మానవత్వం చాటుకున్న ఆటో డ్రైవర్‌

మృతదేహం చెట్టు కొమ్మల్లో ఇరుక్కుపోయి, దుర్వాసన వస్తుండటంతో వెలుపలికి తీయడం పోలీసులకు సవాలుగా మారింది. ఆ సమయంలో అటుగా వెళ్తున్న పెనుగొండకు చెందిన ఆటో డ్రైవర్‌ చిట్టిబాబు తన ఆటోను ఆపి సహాయంగా నిలిచాడు. ఎవరూ ముందుకు రాని పరిస్థితుల్లో ధైర్యంగా వెళ్లి, ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందితో కలిసి మృతదేహాన్ని అంబులెన్స్‌లోకి చేర్చడంలో కీలక పాత్ర పోషించారు. దీంతో చిట్టిబాబుకు పోలీసులతో పాటు స్థానికులు అభినందనలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement