● అడవిలో నాటు పుట్టగొడుగులు లభ్యం
● రుచితోపాటు ఆరోగ్యం
● గిరిజన ప్రాంతంలో కట్ట రూ.100, బయట ప్రాంతాల్లో రూ.500కు కొనుగోలు
బుట్టాయగూడెం: ప్రకృతి సిద్ధంగా అడవుల్లో పెరిగే పుట్టగొడుగుల రుచి అద్భుతంగా ఉంటుంది. వర్షాకాలంలో అటవీ ప్రాంతంలో పుట్టగొడుగులు పెరుగుతుంటాయి. గ్రామాల్లో లభించే పుట్టగొడుగులతో పోలిస్తే, అటవీ ప్రాంతంలో పెరిగేవి గిరిపుత్రుల ఆహారంలో ప్రధాన భాగమవుతున్నాయి. అయితే ఈ ఏడాది వర్షాలు అంతంతమాత్రంగానే కురిశాయి. అయినప్పటికీ, గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా పశ్చిమ మన్యంలోని అటవీ ప్రాంతంలో నాటు పుట్టగొడుగులు విరివిగా లభిస్తున్నాయి. వర్షాల ప్రభావంతో పుట్టలపై పుట్టగొడుగులు పెద్దఎత్తున కనిపిస్తున్నాయి. దీంతో అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉండే గిరిజనులు నాటు పుట్టగొడుగులను సేకరించి, తమ ఇళ్లలో వండుకోవడంతో పాటు విక్రయిస్తున్నారు.
ఒక కట్ట రూ.100 చొప్పున విక్రయం
అటవీ ప్రాంతంలో లభించే పుట్టగొడుగులను 25 నుంచి 30 వరకు ఒక కట్టగా కట్టి, సుమారు రూ.100 చొప్పున గిరిజనులు విక్రయిస్తున్నారు. అడవిలో లభించే ఈ నాటు పుట్టగొడుగులకు అధిక డిమాండ్ ఉంది. అడవి నుంచి తెచ్చిన వెంటనే ఇవి అమ్ముడుపోతున్నాయి. అయితే పుట్టగొడుగుల సేకరణ అంత సులభమైన పనికాదు. తెల్లవారుజామునే అటవీ ప్రాంతానికి వెళ్లి పుట్టలపై ఉన్న పుట్టగొడుగులను సేకరించాలి. ఒక్కోసారి ఆ పుట్టల్లో పాములు ఉండే ప్రమాదం ఉంది. అలాగే చీమలు కూడా కుడతాయి. పుట్టగొడుగుల సేకరణకు వెళ్లిన గిరిజనులు విషపురుగుల బారిన పడిన సంఘటనలు కూడా ఉన్నాయి. ప్రతిఏటా వర్షాకాల సీజన్‌లో ఈ ప్రాంతానికి వచ్చి పుట్టగొడుగులను కొనుగోలు చేసి తీసుకెళ్లేవారు చాలామందే ఉన్నారు. ఈ ఏడాది కూడా వర్షాలకు పుట్టగొడుగులు లభిస్తుండటంతో వీటి కోసం అనేకమంది ఏజెన్సీ ప్రాంతానికి క్యూ కడుతున్నారు. కొంతమంది గిరిజన ప్రాంతంలో రూ. 100కు కొనుగోలు చేసి, బయట ప్రాంతాల్లో రూ.300 నుంచి రూ.500 వరకు విక్రయిస్తున్నారు. ప్రకృతి సిద్ధంగా లభించే ఈ పుట్టగొడుగులు ఎంతో రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని గిరిజనులు చెబుతున్నారు.


