ఏలూరు (టూటౌన్): చెల్లని చెక్కు ఇచ్చిన కేసులో నేరం రుజువు కావడంతో ఒక మహిళకు ఆరు నెలల జైలు శిక్ష, రూ.6.50 లక్షల జరిమానా విధిస్తూ ఏలూరు మొబైల్ కోర్టు ఇచ్చిన తీర్పును ఏలూరు జిల్లా రెండవ అదనపు సెషన్స్ కోర్టు ఖరారు చేస్తూ మంగళవారం తీర్పు వెలువరించింది. మొబైల్ కోర్టు న్యాయమూర్తి 2025లో ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ, చెక్కు ఇప్పించిన ఉప్పల అనురాధ ఏలూరు రెండవ అదనపు జిల్లా సెషన్స్ కోర్టులో అప్పీలు చేయగా.. కోర్టు దానిని కొట్టివేస్తూ కింది కోర్టు తీర్పునే సమర్థించింది. ఏలూరు గాంధీ మైదానం పడమర వీధికి చెందిన మేడపాటి సుధాకర్ రెడ్డి వద్ద 2022 మే 4న అదే ప్రాంతానికి చెందిన ఉప్పల అనురాధ తన కుటుంబ అవసరాల నిమిత్తం రూ.9 లక్షలు అప్పు తీసుకున్నారు. ఆ సొమ్ములో కొంత భాగం చెల్లించేందుకు 2023 మే 5న రూ.6.50 లక్షలకూ చెక్కు అందజేశారు. ఆ చెక్కును సుధాకర్ రెడ్డి బ్యాంకులో జమ చేయగా బౌన్స్ అయింది. దీంతో ఆయన తన న్యాయవాది ద్వారా ఏలూరు మొబైల్ కోర్టులో అనురాధపై కేసు దాఖలు చేశారు. ఈ కేసులో విచారణ జరిపిన మొబైల్ కోర్టు శిక్ష ఖరారు చేయగా, అప్పీలును పరిశీలించిన రెండవ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు ఆ తీర్పును నిలబెట్టింది.
అత్తిలి: తణుకు రైల్వే అవుట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంచిలి –అత్తిలి రైల్వే స్టేషన్ మధ్యలో రైలు కిందపడి మతిస్థిమితం లేని వ్యక్తి మృతి చెందాడు. మంగళవారం అత్తిలి మండలం మంచిలి గ్రామానికి చెందిన చల్లా గణపతి (36) నిడదవోలు నుంచి నరసాపురం వెళుతున్న పాసింజర్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. తణుకు రైల్వే అవుట్ పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
యలమంచిలి: పాలకొల్లు శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయ హుండీలను మంగళవారం లెక్కించారు. నాలుగు నెలల కాలానికి రూ. 17,71,375 ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వణాధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు తెలిపారు. భీమవరం ప్రాంతీయ తనిఖీదారు పి సత్య సాయికుమారి సమక్షంలో సిబ్బంది హుండీలు లెక్కించినట్లు ఆయన చెప్పారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మీసాల రామచంద్రరావు, ఆలయ సూపరింటెండెంట్ వాసు, ధర్మకర్తలు, పాలకొల్లు ఇండియన్ బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.
పోలవరం రూరల్: పోలవరం సీఐ బి. కృష్ణకుమార్ ఆధ్వర్యంలో పోలవరం పోలీసులు, ఎకై ్సజ్ శాఖ అధికారులు సంయుక్తంగా మంగళవారం సారా స్థావరాలపై దాడులు నిర్వహించారు. పోలవరం మండలం తోటగొంది గ్రామానికి సమీపంలోని కాలువ గట్ల వద్ద అక్రమంగా ఏర్పాటు చేసిన సారా తయారీ కేంద్రాలను గుర్తించి తనిఖీ చేశారు. అక్కడ సారా తయారీకి సిద్ధంగా ఉంచిన సుమారు 1,000 లీటర్ల బెల్లం ఊటతో పాటు డ్రమ్ములు, పొయ్యిలు, ఇతర సామాగ్రిని అధికారులు అక్కడికక్కడే ధ్వంసం చేశారు. అక్రమ సారా తయారీదారులను గుర్తించి కఠిన కేసులు నమోదు చేస్తామని ఎస్సై పి. అప్పారావు హెచ్చరించారు. ఈ దాడుల్లో ఎస్సై అప్పారావు, ఎకై ్సజ్ ఎస్సై కె. నాగేంద్రకుమార్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.


