● తక్కువ ధరకే అమ్మకాలు అంటూ హడావుడి
● అట్టహాసంగా నిడమర్రులో అవుట్‌లెట్
● మూడు రోజులకే దుకాణం బంద్
దుకాణం ప్రారంభానికి ముందు రూ.52 వేల విలువైన సూపర్ ఫైన్ బియ్యం బస్తాలు పంపించారు. తొలిరోజు రూ.30 వేలు అమ్మకాలు చేసి ప్రభుత్వానికి చెల్లించాను. దుకాణం అద్దె, నిర్వహణ ఖర్చులు, కమీషన్, కూలి వంటి విషయాలు అడుగుతుంటే అధికారులు సమాధానం చెప్పడం లేదు. బియ్యం సరఫరా చేసిన రైస్‌మిల్లర్ల అసోసిషన్ ప్రతినిధులను అడిగితే ఇప్పటికే కిలో రూ.10 నష్టానికి సరఫరా చేస్తున్నాం, అమ్మకాలకు కమీషన్ ఇవ్వలేమని స్పష్టం చేస్తున్నారు. దీంతో దుకాణం ఎలా నిర్వహించాలో తెలియక మూతపడింది.
–మైలవరపు లాలలయ్య, నిర్వాహకుడు, నిడమర్రు
నిడమర్రులో సూపర్‌ఫైన్ రైస్ అమ్మక దుకాణానికి సంబంధించిన సమస్యను నిర్వాహకులు నా దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయాన్ని డీఎస్‌ఓ దృష్టికి తీసుకుని వెళ్లమని నిర్వాహకులకు చెప్పాం. వీటి నిర్వహణపై ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి మార్గదర్శకాలు లేవు.
–జరీనా బేగం, సివిల్ సప్లయీస్ డీటీ, నిడమర్రు
నిడమర్రు : పేదలకు ప్రభుత్వం సబ్సిడీపై సూపర్ ఫైన్ (సన్న) బియ్యాన్ని తక్కువ ధరకే అందిస్తుందంటూ నిడమర్రులో ఈనెల 4న స్థానిక అధికారులు, నేతలు అట్టహాసంగా అవుట్‌లెట్‌ను ప్రారంభించారు. నిడమర్రు సెంటర్‌లో బియ్యం అమ్మకాలకు ప్రారంభించిన దుకాణం మూడు రోజులకే మూతపడింది. దీంతో పేద, మధ్యతరగతి ప్రజలు సబ్సిడీ సన్నబియ్యం కోసం వచ్చి దుకాణానికి తాళాలు వేసి ఉండటంతో వెనుదిరుగుతున్నారు. ప్రభుత్వం ప్రచార ఆర్భాటమే తప్ప.. ఆచరణలో అమలు కావడం లేదని నిట్టూరుస్తున్నారు.
విధి విధానాలపై స్పష్టత కరువు
మార్కెట్‌లో విపరీతంగా పెరుగుతున్న బియ్యం ధరలను నియంత్రించేందుకు మార్కెట్ విలువ కంటే తక్కువ ధరలకే ఈ దుకాణాల ద్వారా బియ్యం అందిస్తామని చెప్పుకొచ్చారు. మార్కెట్‌లో కిలో రూ.62 నుంచి రూ.68 వరకూ పలుకుతున్న బీపీటీ, కేఎన్‌ఎం సూపర్ ఫైన్ స్టీమ్ బియ్యాన్ని కిలో రూ.52కి, గ్రేడ్–1 రా రైస్ (పచ్చి బియ్యం) కిలో రూ.50కే అందుబాటులో ఉంచుతున్నట్టు ప్రచారం చేశారు. ఆధార్ కార్డు ఆధారంగా ఒకరు రూ.10 కిలోలు కొనుగోలు చేసుకోవచ్చని ప్రకటనలు గుప్పించారు. దీంతో అధికారులు నిడమర్రుకి చెందిన మైలవరపు లాలాలయ్యను ఈ అవుట్‌లెట్ నిర్వహించడానికి ఒప్పించారు. దీంతో ఆయన దుకాణం అద్దెకు తీసుకుని, సొంత ఖర్చులతో ని ర్వహణకు, తూకాలకు సంబంధించిన వస్తువులు కొనుగోలు చేశారు. అవుట్‌లెట్ ప్రారంభంలో అధి కారులు రూ.52 వేల విలువైన బియ్యం కూడా పంపించారు. వాటి అమ్మకాలు కూడా జరిగాయి. త ర్వాత దుకాణం నిర్వహణ ఖర్చులు, అమ్మకం కమీషన్ పై అధికారులు చేతులెత్తేశారు. తమకు ఎలాంటి విధివిధానాలు లేవని చెప్పడంతో దుకాణం మూడు రోజులకే మూతపడింది.


