ముసునూరు: మండల పరిధిలోని బలివే, గోపవరం శివారు వెంకటాపురం అటవీ భూముల్లో అక్రమ మట్టి, గ్రావెల్ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. గ్రామానికి చెందిన టీడీపీ నేతలు నలుగురు కలిసి సిండికేట్‌గా ఏర్పడి ఈ దందా కొనసాగిస్తున్నారని చెబుతున్నారు. ట్రాక్టర్ ట్రక్కు రూ.1,000 నుంచి రూ.1,500 వరకు విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. అలాగే వాహనాలను వేగంగా నడుపుతూ భయాందోళనకు గురిచేస్తున్నారని, ప్రశ్నిస్తే దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతి లేకుండా మట్టి తోలకాలు నిర్వహించడంపై ప్రశ్నిస్తే, అనుమతి ఉందని, ఒకసారి, పర్మిషన్ లేకపోయినా మమ్మల్ని ఆపేది ఎవడు అంటూ దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అటవీ భూముల్లో మట్టి తవ్వకాలకు డబ్బులు ఇచ్చి అనుమతి తెచ్చుకున్నాం అని ధీమాగా సమాధానం చెబుతున్నారని పలువురు పేర్కొంటున్నారు. సంబంధిత అటవీ, రెవెన్యూ, మైనింగ్, పోలీస్ అధికారులు వెంటనే స్పందించి అక్రమ తవ్వకాలను నిలిపివేయాలని గ్రామీణులు కోరుతున్నారు.


