కాళ్ల: ఎల్‌నినో ప్రభావంతో తగ్గుతున్న వర్షపాతం, పెరుగుతున్న ఉష్ణోగ్రతలను తట్టుకునేందుకు రైతులకు అవగాహన కల్పించేలా కేవీకే, ఆంగ్రూ శాస్త్రవేత్తల బృందం గురువారం కాళ్ళ మండలంలోని కోపల్లె, సీసలి, కాళ్ళ, బొండాడ గ్రామాల్లో పర్యటించింది. పొలాలను పరిశీలించిన అనంతరం రైతులతో సమావేశమయ్యారు. కేవీకే కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్.మల్లికార్జునరావు మాట్లాడుతూ వర్షపాతానికి అనుగుణంగా సాగు ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. నేలలో తేమను నిలిపేందుకు మల్చింగ్, అంతర దుక్కి పద్ధతులు పాటించాలని, సకాలంలో సమతుల్య ఎరువులు వేయాలని తెలిపారు. కరవును తట్టుకునే, స్వల్పకాలిక పంట రకాలను ఎంచుకోవాలని కోరారు. కార్యక్రమంలో వ్యవసాయాధికారి పి.రమేష్ నాయుడు, శాస్త్రవేత్తలు, రైతులు పాల్గొన్నారు.
తణుకు అర్బన్: అంతర్జాతీయ సాహితీ సంస్థ విశ్వసాహితీ కళావేదిక నిర్వహించిన జాతీయ స్థాయి కవితల పోటీల్లో తణుకుకు చెందిన ప్రముఖ కవి వీఎస్‌వీ ప్రసాద్ రెండు పురస్కారాలు సాధించారు. కనిపించని గాయం, గుండెకో వ్యథ అనే అంశాలపై నిర్వహించిన ఈ పోటీల్లో టాప్–20లో నిలిచినందుకు కళావేదిక అధ్యక్షురాలు కొల్లి రమాదేవి, జడ్జిలు జి.భవాని, అంజనీకుమారి, భవానిదేవి, సత్తివాడ శ్రీకాంత్, జంధ్యాల శరత్ బాబు, గేదెల శివప్రసాద్ ఆయనను అభినందించారు.
చింతలపూడి (జంగారెడ్డిగూడెం) : ఎర్రకాలువ మిగులు భూమిలో సాగు చేసిన వరి పంటను కొంతమంది ఉద్దేశపూర్వకంగా ట్రాక్టర్‌తో దున్ని ధ్వంసం చేశారని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బాధిత రైతు ఏలేటి విశ్వేశ్వరరావు డిమాండ్ చేశారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ హైకోర్టు పరిధిలోని ఈ భూమిలో పంట సాగు చేసుకుంటున్న తమకు రక్షణ కల్పించాలని కోరినా అధికారులు స్పందించలేదని వాపోయారు. అనంతరం స్థానిక సచివాలయం వద్ద గ్రామస్తులతో కలిసి నిరసన తెలిపారు. స్పందించకుంటే ఇరిగేషన్ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీతా, బొక్క వెంకటేశు, కలపాల వెంకయ్య, ఎడ్లపల్లి దుర్గారావు, ఎంకమ్మ, కలపాల నాగభూషణం, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
ముసునూరు: ఇంజిన్ ఆపకుండా నిర్లక్ష్యంగా న్యూట్రల్‌లో ఉంచిన ట్రాక్టర్ వెనుకకు వచ్చి ఢీకొనడంతో ఒకరు మృతి చెందిన సంఘటన ముసునూరులో చోటు చేసుకుంది. ఎస్సై ఎం.చిరంజీవి తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన పాకనాటి వెంకటేశ్వరరావు (64) పశువులను మేతకు తోలుకెళ్తుండగా, సందు దారిలో ఆగి ఉన్న ట్రాక్టర్ ఒక్కసారిగా వెనక్కి వచ్చి ఢీకొట్టింది. ట్రాక్టర్ చక్రం తలపై నుంచి వెళ్లడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహానికి నూజివీడు ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.
వీరవాసరం: మండలంలోని పెరికిపాలెం గ్రామంలో ప్రమాదవశాత్తూ విద్యుత్ తీగలు తెగిపడటంతో రెండు గేదెలు మృత్యువాత పడ్డాయి. గ్రామానికి చెందిన సనకం వెంకటేశ్వరరావుకు చెందిన పశువుల పాక వద్ద గురువారం విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. ఈ ప్రమాదంలో పాక వద్ద ఉన్న పాడి గేదె, దూడ అక్కడికక్కడే మృతి చెందాయి. బాధితుడు తీవ్రంగా నష్టపోవడంతో ప్రభుత్వం చొరవ తీసుకుని బాధితుడికి పరిహారం అందించి న్యాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ఉండి: అదనపు కట్నం కోసం వేధిస్తున్న భర్త, అత్తలపై ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల ప్రకారం ఉండి శివారు నక్కరాజుగుంట ప్రాంతానికి చెందిన అందుకూరి మౌనిక, అందుకూరి కిరణ్‌లు 2011లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వివాహ సమయంలో రూ.5 లక్షలు కట్నంగానూ, ఐదు కాసులు బంగారం ఇచ్చారు. ప్రస్తుతం కిరణ్ హైదరాబాద్‌లో ఉంటూ మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని, ఇటీవల ఆమె అత్తతో కలిసి అదనంగా రూ.2 లక్షలు నగదు తేవాలని వేధిస్తున్నాడు. దీంతో మైనిక పోలీసులను ఆశ్రయించడంతో ఎస్సై హెచ్.మల్లికార్జునరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


