నాణ్యత లేని ఆహారాన్ని అందిస్తే సహించం | - | Sakshi
Sakshi News home page

నాణ్యత లేని ఆహారాన్ని అందిస్తే సహించం

Aug 7 2026 12:56 AM | Updated on Aug 7 2026 12:56 AM

భీమడోలు: పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యత లేని ఆహారాన్ని అందిస్తే సహించేది లేదని రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ సభ్యుడు జక్కంపూడి కృష్ణకిరణ్‌ హెచ్చరించారు. రెండు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా రెండో రోజైన గురువారం ఆయన పొలసానిపల్లి, భీమడోలు గ్రామాల్లోని గురుకుల, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలు, బాలికల వసతి గృహాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పొలసానిపల్లి గురుకుల పాఠశాలలో వంటగది, బియ్యం, నిత్యావసర సరుకుల నాణ్యత, ఎక్స్‌పైరీ తేదీలు, స్టాక్‌ రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించి, మధ్యాహ్న భోజనాన్ని రుచి చూశారు. అనంతరం విద్యార్థినులతో ప్రత్యేకంగా సమావేశమై భోజన వసతులపై ఆరాతీశారు. ఈ సందర్భంగా బాలికలు తమ సమస్యలను ఆయనకు లిఖితపూర్వకంగా విన్నవించారు. భోజనంలో ఉప్మా, పులిహోర సరిగా ఉండటం లేదని, చికెన్‌ సరిగా ఉడకడం లేదని ఫిర్యాదు చేశారు. అలాగే తమకు నచ్చని గోరుచిక్కుడు వంటి కూరగాయలనే ఎక్కువగా వండి పెడుతున్నారని, తాగునీటి ఎద్దడి కూడా ఉందని తెలిపారు. విద్యార్థులకు రుచికరమైన, శుభ్రమైన ఆహారాన్ని అందించాల్సిన బాధ్యత ప్రిన్సిపాల్‌దేనని స్పష్టం చేసిన ఆయన, ఈ సమస్యలను జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. అనంతరం భీమడోలు జెడ్పీ ఉన్నత పాఠశాలను తనిఖీ చేసి, స్టోర్‌ రూమ్‌, వంట పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంపై హెచ్‌ఎంను ప్రశ్నించారు. అలాగే భీమడోలు బాలికల వసతి గృహం శిథిలావస్థకు చేరిందని, తమను వేరే ప్రాంతానికి తరలించాలని కోరిన విద్యార్థినుల విజ్ఞప్తిపై స్పందిస్తూ, ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఆహార భద్రత కల్పించడమే ఫుడ్‌ కమిషన్‌ ముఖ్య ఉద్దేశమని, నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడేది లేదన్నారు. పర్యటనలో భాగంగా టి.నరసాపురం పరిధిలోని సాగిపాడు అంగన్‌వాడీ కేంద్రం మూసివేసి ఉండడాన్ని, ద్వారకాతిరుమల మండలంలోని ఒక పాఠశాలలో 300 కోడిగుడ్లు కుళ్లిపోవడాన్ని గుర్తించామన్నారు. ఈ లోపాలన్నింటిపై సమగ్ర నివేదిక తయారు చేసి కమిషన్‌ చైర్మన్‌, సంబంధిత అధికారులకు అందజేస్తామని తెలిపారు. ఈ తనిఖీల్లో సీఎస్‌డీటీ భరత్‌కుమార్‌, ఎంఈఓ–2 అయినపర్తి భాస్కర్‌కుమార్‌, ఐసీడీఎస్‌ పీఓ ఎంఎస్‌ రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement