దాతల సహకారంతో వేగంగా అభివృద్ధి
అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నాం
కాళ్ల : పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం, కాళ్ల మండలం కాళ్లకూరులో స్వయంభూగా వెలసిన శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం నానాటికీ సుప్రసిద్ధ క్షేత్రంగా అభివృద్ధి చెందుతోంది. తిరుపతి తరహాలోనే ఏటా స్వామివారి ఊరేగింపు నిర్వహించేందుకు ఆలయ మాడవీధుల నిర్మాణంతో పాటు ఇతర మౌలిక వసతుల కల్పనకు దాతల ప్రోత్సాహంతో సుమారు రూ.3 కోట్లతో ఆలయాభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.
ప్రగతిలో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు
● ఆలయంలోని తూర్పు, ఉత్తర రాజగోపురాలకు దాత గాదిరాజు కిరణ్ కుమార్ వర్మ (కలిగొట్ల కిరణ్) సహకారంతో రూ.10 లక్షల వ్యయంతో రాతి గుమ్మాలు, టేకు తలుపులు ఏర్పాటు చేస్తున్నారు.
● ఏలూరుపాడు గ్రామానికి చెందిన దాత దాట్ల శ్రీనివాసరాజు ఆర్థిక సహకారంతో రూ.12 లక్షల వ్యయంతో నూతన కేశఖండనశాల భవన నిర్మాణం చేస్తున్నారు.
● రూ.కోటి అంచనా వ్యయంతో నిర్మిస్తున్న అన్నదాన భవన పనులు చివరి దశకు చేరుకున్నాయి. ప్రభుత్వం నుంచి రూ.60 లక్షలు, దాతల నుంచి రూ.40 లక్షలతో దీనిని నిర్మిస్తున్నారు. ఇందులో రూ.25 లక్షల వ్యయంతో భగవాన్ ట్రేడర్స్ అధినేత నడింపల్లి వెంకట రామరాజు సహకారంతో నూతన వంటశాల, గొట్టుముక్కల వెంకట సత్యనారాయణరాజు సహకారంతో టైల్స్ పనులు చేపడుతున్నారు.
● అన్నదాన భవనాన్ని ఆనుకుని ముదునూరి వెంకట శివరామరాజు (పాందువ్వ శివ) సహకారంతో రూ.11.50 లక్షల వ్యయంతో 123 అడుగుల షెడ్ నిర్మిస్తున్నారు.
● మాడవీధుల ఏర్పాటు, అన్నదాన భవన మార్గం కోసం భక్తులు స్వచ్ఛందంగా 13 సెంట్ల (15 అడుగుల వెడల్పు) భూమిని అందజేశారు. అలాగే మాడవీధుల కోసం రూ.99 లక్షలతో ఐదున్నర సెంట్ల స్థలాన్ని కొనుగోలు చేశారు. దీనికి గాను దాతలు ఇప్పటివరకు రూ.55 లక్షలు అందించగా, మరో రూ.44 లక్షలు సేకరించాల్సి ఉంది.
భవిష్యత్తు ప్రణాళికలివే
● మాడవీధుల నిర్మాణానికి అడ్డుగా ఉన్న పాత వంటశాలను తొలగించి దాతల సహకారంతో కొత్త వంటశాల, ప్రసాదం ప్యాకింగ్ భవనం, ఆలయ కార్యాలయాన్ని నిర్మించనున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్–అక్టోబర్ నెలల్లో పనులు ప్రారంభించి, నూతన సంవత్సరం నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
● దేవస్థాన ప్రాంగణంలో రూ.80 లక్షల అంచనా వ్యయంతో నూతన మండపాన్ని నిర్మించనున్నారు. అక్టోబర్–నవంబర్ మాసాల్లో పనులు ప్రారంభించి నూతన సంవత్సరానికి భక్తులకు అందుబాటులోకి తెస్తారు.
● భక్తులకు స్వామివారి మూలవిరాట్ స్పష్టంగా కనిపించేలా ప్రస్తుతం గుడిలో ఉన్న 4 గుమ్మాలను మార్చి నూతనంగా ఏర్పాటు చేయనున్నారు.
● తూర్పు రాజగోపురం వద్ద దానితో సమాన ఎత్తు కలిగిన భారీ ఆంజనేయస్వామి విగ్రహాన్ని వచ్చే ఏడాది మార్చి నాటికి ఆవిష్కరించేలా ఒక దాత ముందుకు వచ్చారు.
● ప్రస్తుతం శిథిలావస్థకు చేరిన దక్షిణం వైపు కాంపౌండ్ వాల్‌ను పునర్నిర్మించేందుకు చర్యలు చేపడుతున్నారు.
కాళ్లకూరు వేంకటేశ్వరస్వామి ఆలయంలో రూ.3 కోట్లతో అభివృద్ధి పనులు
గతంలో ఎన్నడూ లేనివిధంగా స్వామివారి సేవలో తరించేందుకు భక్తులు, దాతలు విరివిగా విరాళాలు అందిస్తున్నారు. పెద్ద తిరుపతి మాదిరిగా మాడవీధులు, అన్నదాన భవనం, కేశఖండన శాల వంటి నిర్మాణాలు చేపడుతున్నాం. స్వామివారి కృప దాతలు, భక్తులపై ఎల్లప్పుడూ ఉంటుంది.
– అడ్డాల శివరామరాజు, ఆలయ చైర్మన్
కలియుగ దైవమైన కాళ్లకూరు శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాభివృద్ధికి కృష్ణా, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల నుంచి భక్తులు, దాతలు విశేషంగా ముందుకు వస్తున్నారు. ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో దాతలను ప్రోత్సహిస్తూ ఆలయంలో మరిన్ని సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నాం.
– ఎం.అరుణ్ కుమార్, ఆలయ ఈఓ


