సమస్యల పరిష్కారానికి సహకరించాలి
భీమవరం: సమస్యల పరిష్కారం కేవలం అధికారుల ద్వారానే సాధ్యం కాదని, ప్రజల సహకారం అవసర మని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో విలేకరులతో మాట్లాడుతూ గతేడాది సాధించిన ప్రగతిని వివరించారు. అన్ని శాఖల సమష్టి కృషితో లక్ష్యాలను సాధించామన్నారు. ఖరీఫ్ సీజన్‌లో 67 వేల మంది రైతుల నుంచి 4.33 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించి రూ.987 కోట్లు వారి బ్యాంకు ఖాతాలో జమచేశామన్నారు. రబీ సీజన్‌కు సంబంధించి 38 వేల టన్నుల యూరియాను సిద్ధం చేశామన్నారు. జిల్లాలో యూరియా కొరత లేదన్నారు. 100 మంది పేద మత్స్యకారులకు పీఎం లంకలో బోట్ల నిర్మాణం జరుగుతోందన్నారు. జిల్లాలో గురప్రుడెక్క నుంచి కంపోస్టు తయారు చేసేందుకు మహిళా సంఘాలను ప్రోత్సహిస్తున్నామన్నారు. తాడేపల్లిగూడెంలో కోకో ఉత్పత్తుల ద్వారా మహిళా సంఘాలు చాక్లెట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం ద్వారా అభివృద్ధి పథంలో నడుస్తున్నారన్నారు. అలాగే మహిళా సంఘాలకు సముద్రపు నాచు తయారీలో శిక్షణ ఇచ్చామన్నారు. జిల్లాలో ప్రభుత్వ స్థలాల ఆక్రమణల తొలగింపుపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. తణుకు ఏరియా ఆస్పత్రికి రాష్ట్రస్థాయి కాయకల్ప అవార్డు లభించిందన్నారు. పాఠశాల మౌలిక సదుపాయాల కల్పనలో జిల్లా రెండో స్థానంలో, అకడమిక్ పెర్ఫార్మెన్స్‌లో 5వ ర్యాంకు సాధించిందని కలెక్టర్ వివరించారు. జేసీ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి, డీఆర్వో బి.శివన్నారాయణరెడ్డి పాల్గొన్నారు.


