విష్ చేశారో మీ సొమ్ము మటాష్ !
● శుభాకాంక్షల పేరుతో సైబర్ కేటుగాళ్ల నయా స్కెచ్
● వాట్సాప్ లింక్స్ ద్వారా
డబ్బు కాజేస్తున్న వైనం
తణుకు అర్బన్: సాధారణంగా పండుగలు లేకపోతే ప్రత్యేక రోజుల్లో మన స్నేహితులతో పాటు మనకు అయిన వారికి శుభాకాంక్షలు తెలుపుకోవడం సర్వ సాధారణ విషయం. ఇటీవల పెరిగిన స్మార్ట్ ఫోన్ల వినియోగంతో ఈ కల్చర్ మరింత పెరిగింది. సరిగ్గా ఈ విషయాన్నే సైబర్ నేరగాళ్లు క్యాష్ చేసుకునేందుకు ఉపయోగిస్తున్నారు. వాట్సాప్ విషెస్ పేరుతో లింక్స్ పంపి బ్యాంక్ ఖాతాల్లోని లక్షలాది రూపాయిలను ఖాళీ చేసేస్తున్నారు కేటుగాళ్లు. తాజాగా మీ పేరు, మీ ఫొటోతో మీ స్నేహితులకు న్యూ ఇయర్ విషెష్ చెప్పొచ్చని ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి అని... సంక్రాంతి పండుగ ఆన్‌లైన్ ఆఫర్లు కావాలా..? అంటూ సోషల్‌మీడియాలో వస్తున్న లింక్స్‌తో బ్యాంకు ఖాతాలు ఖాళీ అవుతున్న పరిస్థితులు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇప్పటివరకు మీ బ్యాంక్ ఖాతాను ఈ–కేవైసీ చేయాలని కొన్ని, మీ వాహనానికి ట్రాఫిక్ చలాన్ వచ్చిందనే ఏపీకే ఫైల్స్, సీఐడీ ఇతర పోలీసు విభాగాల అధికారులమని మీ న్యూడ్ కాల్స్ వివరాలు మా వద్ద ఉన్నాయని మరికొన్ని, మీ పిల్లలు మా వద్ద ఉన్నారు తక్షణమే మా అకౌంట్‌కు లక్షలు చెల్లించాలనే ఫోన్ కాల్స్ ద్వారా జరిగిన సైబర్ నేరాలతో ప్రజానీకం అల్లాడుతుండగా తాజాగా న్యూ ఇయర్, సంక్రాంతి శుభాకాంక్షల పేరుతో ఖాతాలు ఖాళీ చేసేందుకు సైబర్ కేటుగాళ్లు సిద్ధంగా ఉన్నట్లుగా పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
శుభాకాంక్షలే టార్గెట్‌గా...
సైబర్ నేరగాళ్లు బ్యాంకు అకౌంట్‌ల నుంచి నగదు దొంగిలించేందుకు కొత్త రకమైన ట్రెండ్‌ను సెట్ చేశారు. ఇప్పటికే రకరకాల పద్ధతుల్లో డబ్బు దోచుకుంటున్న కేటుగాళ్ల తాజా వ్యూహం నూతన సంవత్సరంతో పాటు సంక్రాంతి పండుగకుముడిపెట్టినట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలంటూ మైకు ద్వారా ప్రచారం చేస్తున్నారు. నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు సందర్భంగా విషెష్ చెబుతున్నట్లుగా వచ్చే లింకులు ఓపెన్ చేయవద్దని అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా అధికసంఖ్యలో ఆన్‌లైన్ షాపింగ్, ఆర్డర్స్ బుకింగ్ చేసే వారి ఫేస్‌బుక్, వాట్సాప్ ఖాతాల ద్వారా వ్యక్తుల వివరాలు సేకరించి మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు హెచ్చరిస్తున్నారు.
అవగాహన అవసరం
సైబర్ నేరాలకు గురికాకుండా జాగ్రత్తలు పాటించాలంటే ముఖ్యంగా థర్డ్ పార్టీగా ఉండే యాప్‌లు చాలా ప్రమాదకరమని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. కేవలం ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న యాప్‌లు మాత్రమే సురక్షితంగా ఉంటాయని వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే లింకులు, డాక్యుమెంట్లు, ఏపీకే ఫైల్స్ ఓపెన్ చేయవద్దనేది న్యాయ నిపుణుల సలహా ఇస్తున్నారు. ఆన్‌లైన్ మోసానికి గురైనట్లుగా తెలిసిన వెంటనే 1930 (నేషనల్ సైబర్ హెల్ప్ లైన్) నంబరుకు కాల్‌చేసి సమాచారం ఇవ్వడంతోపాటు స్థానికంగా ఉన్న పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది.
జిల్లాలో రూ.9 కోట్ల మేర దోపిడీ
జిల్లాలో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది సైబర్ నేరాల దోపిడీ బాగా పెరిగినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. గతేడాది 16 సైబర్ నేరాలకుగాను సుమారుగా రూ. 3 కోట్ల నగదు సైబర్ నేరగాళ్లు దోచుకోగా, ఈ ఏడాది 30 సైబర్ నేరాలకుగాను రూ.9 కోట్ల నగదును కేటుగాళ్లు దోచుకున్నారు. ఈ సైబర్ నేరాలకు సంబంధించి కొన్ని కేసుల్లో బాధితులకు పోలీసులు రూ.42 లక్షల వరకు రికవరీ చేసి ఇచ్చారు. అయితే బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయని సైబర్‌నేరాలు చాలా ఉన్నట్లుగా తెలుస్తోంది.
విష్ చేశారో మీ సొమ్ము మటాష్ !
విష్ చేశారో మీ సొమ్ము మటాష్ !


