బంగారు ఆభరణాలను చోరీ చేస్తున్న దొంగల అరెస్టు
నూజివీడు: వృద్ధులకు మత్తు మందు ఇచ్చి చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర నేరస్తుడు పబ్బరాజు వెంకట యుగంధర్(38)ను పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ.12 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను నూజివీడు డిఎస్పీ కేవీవీఎన్‌వీ ప్రసాద్ బుధవారం నూజివీడు రూరల్ సీఐ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరానికి చెందిన పబ్బరాజు వెంకట యుగంధర్ గత 20 ఏళ్లుగా ఒంటరిగా ఉంటున్న వృద్ధుల ఇళ్లల్లో అద్దెకు ఉంటూ వారిని నమ్మించి అనంతరం పానకంలో మత్తు మందు కలిపి ఇచ్చి స్పృహ కోల్పోయాక బంగారు ఆభరణాలను దోచుకొని పారిపోయేవాడు. ఇదే క్రమంలో ముసునూరు మండలం వలసపల్లిలో బండారుపల్లి జయలక్ష్మి(68)కు మత్తు మందు ఇచ్చి బంగారు ఆభరణాలను, సెల్‌ఫోన్‌ను గతేడాది నవంబరు 25న దోచుకెళ్లాడు. దీనిపై ముసునూరు పోలీస్‌స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేయగా ఎస్సై ఎం.చిరంజీవి దర్యాప్తు చేపట్టి నిందితుడిని గతనెల 30న గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కొలనుకొండలో అరెస్టు చేశారు. విచారణలో చింతలపూడి మండలం ప్రగడవరం, దెందులూరు మండలం వేగవరం, కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం పురిటిగడ్డలో చేసిన దొంగతనాల్లో చోరీ సొత్తును సైతం స్వాధీనం చేసుకున్నారు. 149 గ్రాముల నాన్‌తాళ్లు, నాలుగు సెల్‌ఫోన్‌లు, హోండాషైన్ మోటార్ సైకిల్‌లను స్వాధీనం చేసుకున్నారు. అపరిచిత వ్యక్తులను నమ్మి ఇల్లు అద్దెకు ఇవ్వొద్దని, అపరిచితులు ఇచ్చే కూల్‌డ్రింక్స్, పానకం తీసుకోవద్దని, అనుమానాస్పద వ్యక్తులపై తక్షణమే పోలీస్‌స్టేషన్ సమచారం ఇవ్వాలని డీఎస్పీ కోరారు.
ఇద్దరు దొంగల అరెస్టు
ఒంటరిగా ఉండే వృద్ధ మహిళలను లక్ష్యంగా చేసుకొని చైన్ స్నాచింగ్ చేస్తున్న ఇద్దరిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. నూజివీడు మండలం మర్రికుంట వద్ద ఒంటరిగా ఉన్న పున్నం నాగేశ్వరమ్మ(60) మెడలోని నాన్‌తాడును గత నెల 26న ఇరువురు యువకులు వచ్చి లాక్కెళ్లిన కేసులో ఇరువురు నిందితులను రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. ముసునూరు మండలం బలివే కు చెందిన కాగితాల సతీష్, నాయుడు రాజేష్‌లు తాము దొంగిలించిన సొమ్మును విక్రయించేందుకు వెళ్తుండగా గత నెల 30న మీర్జాపురం శివారులో అరెస్టు చేసి వారి వద్ద నుంచి 20 గ్రాముల బంగారు నాన్‌తాడు, మోటర్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సమావేశంలో నూజివీడు రూరల్ సీఐ కొప్పిశెట్టి రామకృష్ణ, ముసునూరు ఎస్సై ఎం.చిరంజీవి, నూజివీడు రూరల్ ఎస్సులు ఎన్.లక్ష్మణ్‌బాబు, జ్యోతిబసు పాల్గొన్నారు.


