ఏలూరులో ‘పచ్చ’పాతం
ఏలూరు టౌన్: ఏలూరులో ‘పచ్చ’పాతం పెచ్చుమీరుతోంది. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో వైఎస్సార్ సీపీ శ్రేణులు ఏర్పాటు చేసుకున్న ఫ్లెక్సీలను కక్షపూరితంగా అధికారులు తొలగించడంతో వివాదం నెలకొంది. వివరాల్లోకి వెళితే ఏలూరు 19వ డివిజన్ హనుమాన్‌నగర్ ప్రాంతంలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుంటూ ఉండగా.. నగరపాలక సంస్థ టౌన్‌ప్లానింగ్ సిబ్బంది ఆ ఫ్లెక్సీలను తొలగించారు. దీనిపై స్థానిక నాయకులు ఇదేమి విధానమంటూ టౌన్‌ప్లానింగ్ సిబ్బందిని నిలదీశారు. దీంతో వారు ఏలూరు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, నాయకులను రూరల్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లారు. పార్టీ ఏలూరు సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకాష్ సూచనలతో ఏలూరు నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాస్, జిల్లా అధికార ప్రతినిధి మున్నుల జాన్‌గురునాథ్, లీగల్ సెల్ అధ్యక్షుడు ప్రత్తిపాటి తంబి రూరల్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడ్డారు. ఏలూరు నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ నేతలపై కక్షపూరిత చర్యలు పెచ్చుమీరుతున్నాయన్నారు. టౌన్‌ప్లానింగ్ అధికారులకు నగరంలో ఏర్పాటు చేసిన ఇతర పార్టీలు, వ్యాపార సంస్థల ఫ్లెక్సీల కనిపించకపోవటం శోచనీయన్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా వైఎస్సార్ సీపీ శ్రేణులపై నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు కక్షపూరితంగా వ్యవహరించటం సరికాదన్నారు. ఈ విషయంపై ఇప్పటికే తాము నగరపాలక సంస్థ కమిషనర్ భానుప్రతాప్‌కు వినతిపత్రం సమర్పించామని, అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.


