వైఎస్సార్ విగ్రహానికి కంచె
తణుకు అర్బన్: తణుకు వై.జంక్షన్‌లోని వైఎస్సార్ విగ్రహం చుట్టూ రెవెన్యూ అధికారులు పోలీసుల సమక్షంలో ఇనుప కంచెను ఏర్పాటు చేయడం సంచలనం రేకెత్తిస్తోంది. ఈనెల 5, 6 తేదీల్లో వైఎస్సార్ విగ్రహాన్ని ప్రారంభిస్తామని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ప్రకటించడంతో ఆ విగ్రహ ప్రాంతంలోకి ఎవరినీ వెళ్లనివ్వకుండా ఇలా కంచె వేశారని వైఎస్సార్ సీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు సర్కారు ఒత్తిడితో రెవెన్యూ అధికారులు ఈ కంచెను ఏర్పాటుచేశారని ప్రజలు సైతం చర్చించుకుంటున్నారు.
ముదురుతున్న ఫ్లెక్సీ వివాదం
వైఎస్సార్ విగ్రహం వద్ద ఏర్పాటుచేసిన చంద్రబాబు ఫ్లెక్సీ వ్యవహారం రోజురోజుకీ ముదురుతోంది. ఈనెల 25న టీడీపీ సానుభూతిపరుడు వైఎస్సార్ విగ్రహానికి చంద్రబాబు ఫ్లెక్సీ ఏర్పాటు చేశాడు. దీంతో మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు వైఎస్సార్ సీపీ శ్రేణులతో కలిసి ఆ ఫ్లెక్సీ ముందు వైఎస్సార్‌సీపీ ఫ్లెక్సీ పెట్టడం.. ఆపై రెండు ఫ్లెక్సీలను పోలీసులు తొలగింపజేయడం తెలిసిన విషయమే. అయితే ఆ రోజు నుంచి పోలీస్ సిబ్బంది నిరంతరం ఆ ప్రాంతంలో బందోబస్తు నిర్వహిస్తున్నారు. దీంతో పాటు ఈనెల 28వ తేదీన ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు. అంతేకాకుండా ఈనెల 29వ తేదీన ఫ్లెక్సీ ఘటనకు సంబంధించి మాజీ మంత్రి కారుమూరితో సహా 13 మంది పార్టీ నాయకులపై కేసులు నమోదుచేశారు. తాజాగా వైఎస్సార్ విగ్రహం వద్దకు ఎవ్వరినీ వెళ్లనీయకుండా చుట్టూ కంచె ఏర్పాటు చేయడం విమర్శలకు తావిస్తోంది.


