చంద్రబాబు ప్రభుత్వం అన్నింటా విఫలం
మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ
ఉంగుటూరు: కూటమి ప్రభుత్వం అన్నింటా వైఫల్యం చెందిందని, దీంతో ప్రజలు తమ వైపు (వైఎస్సార్ సీపీ) చూస్తున్నారని రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. బుధవారం గోపినాథపట్నంలో ఆయన ‘సాక్షి’ విలేకరితో మాట్లాడారు. గత ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలలో ఏ ఒక్కటీ చంద్రబాబు ప్రభుత్వం పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయారని అన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, లోక్‌ష్‌ల మీద ప్రజలు పెట్టుకున్న భ్రమలు ఏడాదిన్నర కాలంలోనే తొలగిపోయాయన్నారు. అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని వివరించారు. గత పథకాలు పేరు మార్చినా పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోయారని కొట్టు ఎద్దేవా చేశారు. 20 లక్షలు ఉద్యోగాలు ఇస్తానని అన్నారని.. అవి ఎక్కడ అని ప్రశ్నించారు. అలాగే నిరుద్యోగ భృతి రూ.3 వేలు, మహిళలకు నెలకు రూ.1,500 ఇస్తానన్న హామీలు ఏమయ్యాయన్నారు. ఏడాదికి మూడు సిలిండర్ల హామీలో కొందరికి ఒకటి, మరికొందరికి రెండు, కొందరికి అసలు ఇవ్వలేదని మాజీ మంత్రి కొట్టు వివరించారు. రైతులకు కనీసం యూరియా సరఫరా చేయడంలో కూడా ప్రభుత్వం విఫలమైందన్నారు. పంట నష్టం జరిగినా ఆదుకోలేదని విమర్శించారు. జగన్ హయాంలో ఇన్సూరెన్స్ ప్రీమియం ప్రభుత్వమే చెల్లించి రైతులందరికీ పంట నష్టం అందేలా చేశారన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణలో చంద్రబాబు అత్యుత్సాహం చూపారని, ఈ విషయంలో ప్రభుత్వ తీరును వైఎస్సార్ సీపీ కోటి సంతకాలతో పూర్తిస్థాయిలో ఎండగట్టిందని మాజీ మంత్రి కొట్టు వివరించారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం, జూదం కొనసాగుతున్నాయని, ఇసుక దోపిడీ జరుగుతోందని కొట్టు తెలిపారు. ప్రజాసమస్యల పోరాటానికి వైఎస్ జగన్ పార్టీ క్యాడర్‌ను సిద్ధం చేస్తున్నారని, ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ఎండగడతామని తెలిపారు.


