స్వార్థంతోనే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ
నరసాపురం రూరల్: చంద్రబాబు ప్రభుత్వం స్వార్థం కోసమే మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ చేస్తోందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు అన్నారు. శుక్రవారం మండలంలోని వేములదీవి వెస్ట్ గ్రామంలో కోటి సంతకాల సేకరణ, రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసాదరాజు మాట్లాడుతూ పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయడమే చంద్రబాబు పన్నాగమని విమర్శించారు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంజూరు చేసిన వైద్య కళాశాలలను నిర్మించే సామర్థ్యం చంద్రబాబు ప్రభుత్వానికి లేక, కమీషన్లు దండుకునేందుకు ప్రైవేటుపరం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారని, భవిష్యత్తులో ఈ ప్రభుత్వాన్ని సాగనంపడం ఖాయమన్నారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వం అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. ఇప్పటికే నియోజకవర్గంలోని పలు పంచాయతీల్లో కోటి సంతకాల కార్యక్రమంలో సంతకాలు సేకరించామన్నారు. అధిక సంఖ్యలో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పోరాటానికి మద్దతు పలకడం అభినందనీయమన్నారు. నాయకులు పీడీ రాజు, ఉంగరాల ర మేష్, దొండపాటి వెంకట్, ఓడుగు సత్యనారాయణ, మైలాబత్తుల శ్రీను, కడలి రాంబాబు, దొంగ మురళి, అండ్రాజు చల్లారావు, తిరుమాని నాగరాజు, అడ్డాల నర్సింహరావు, గాది సుధారాణి పాల్గొన్నారు.


