పేదలకు వైద్య విద్యను దూరం చేసే కుట్ర
కేంద్రంలోని మోదీ–షా ప్రభుత్వం నరమేధానికి పాల్పడుతోంది..
ఏలూరు (టూటౌన్) : రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టిన 18 నెలల వ్యవధిలో రూ.2.50 లక్షల కోట్లు అప్పు తెచ్చిందని, దీనిలో రూ.4 వేల కోట్లు ఖర్చు పెడితే రాష్ట్రంలోని 17 మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వస్తాయని, తద్వారా 2 వేల మెడికల్ సీట్లు రాష్ట్రంలోని విద్యార్థులకు అందుబాటులో ఉండేవని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య తెలిపారు. ఏలూరులోని సీపీఐ జిల్లా కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మెడికల్ కాలేజీలు పూర్తయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు అగ్రవర్ణ పేదలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఇది వదిలేసి ప్రైవేట్ వ్యక్తులకు వీటిని కట్టబెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు.
హామీలన్నీ గాలికొదిలేశారు..
కూటమి నేతలు ఎన్నికలకు ముందు అనేక అంశాలపై వాగ్దానాలు చేశారని, అధికారంలోకొచ్చిన తర్వాత వాటిని గాలికి వదిలేశారని మండిపడ్డారు. గిట్టుబాటు ధరలు లేక ఉద్యాన పంటలు పండించే రైతులు తీవ్ర నష్టాల పాలవుతున్నారని, పెరిగిన నిత్యావసరాలు, కూరగాయల ధరలతో ప్రజలు విలవిల్లాడుతున్నారని ఆయన చెప్పారు. అయినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని విమర్శించారు. రాష్ట్రంలో విద్యారంగం నేడు మరణ శయ్యపై ఉందని, వేలాది ఖాళీ పోస్టులను భర్తీ చేయడం లేదని ఆయన తెలిపారు. నిరుద్యోగులకు నెలకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారని, నేడు ఆ మాటే మర్చిపోయారని విమర్శించారు. నిరుద్యోగ భృతి ఇవ్వలేనప్పుడు వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
స్టీల్ ప్లాంట్ ఉద్యోగులను బెదిరించడం తగదు
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉద్యోగులను బెదిరించినట్టు మాట్లాడటం తగదని ఈశ్వరయ్య అన్నారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఒకే ప్రభుత్వం ఉన్నప్పటికీ ఎందరో ప్రాణత్యాగాలతో ఏర్పడి, లక్ష కోట్ల రూపాయల టర్నోవర్ కలిగిన విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేసేందుకు పావులు కదపడం అత్యంత దుర్మార్గమన్నారు. ఎన్నికలకు ముందు జూలు విదిల్చి ప్రశ్నిస్తా, ఆరేస్తా అంటూ ప్రగల్భాలు పలికిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో నోరుమెదపరేమని ప్రశ్నించారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య
కేంద్రంలోని మోదీ–షా ప్రభుత్వం నరమేధానికి పాల్పడుతోందని ఈశ్వరయ్య దుయ్యబట్టారు. లొంగిపోయేందుకు ప్రయత్నిస్తున్న మావోయిస్టులను పట్టుకుని అడవిలోకి తీసుకెళ్ళి బూటకపు ఎన్‌కౌంటర్‌లు చేస్తున్నారని విమర్శించారు. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్రం చేస్తున్నది అత్యంత దుర్మార్గం, దారుణమని చెప్పారు. డిసెంబర్ 26న ఖమ్మం జిల్లాలో సీపీఐ శత వార్షికోత్సవాల సభను ఐదు లక్షల మందితో నిర్వహిస్తున్నట్టు ఈశ్వరయ్య చెప్పారు. ఈ సందర్భంగా లక్ష మంది వలంటీర్లతో కవాతు నిర్వహిస్తామన్నారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు రెడ్డి శ్రీనివాస డాంగే, తొర్లపాటి బాబు, నిమ్మగడ్డ నరసింహ, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు చలసాని వెంకట రామారావు పాల్గొన్నారు.


