శివాలయంలో ప్రతిష్ఠ మహోత్సవాలు
ద్వారకాతిరుమల: క్షేత్రపాలకుడైన శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామివారి ఆలయంలో నూతన రాజగోపుర శిఖర ప్రతిష్ఠ మహోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలుత ఆలయం ముందు తాత్కాలికంగా నిర్మించిన యాగశాలలో పండితులు ఉదయం 9.30 గంటలకు గణపతి పూజ నిర్వహించి, ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా పుణ్యాహవాచన, పంచగవ్యప్రాసన, దీక్షధారణ, యాగశాల సంస్కారం, ప్రధాన దేవత ఆవరణ మండపారాధనలు, అగ్నిప్రతిష్ఠాపన, అఖండదీప స్థాపన, పంచగవ్యాదివాసం, బలిహరణ, నీరాజన మంత్రపుష్పాలను వేద మంత్రోచ్ఛరణలతో వైభవంగా నిర్వహించారు. యాగశాలలో వేదికపై ఆశీనులైన స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు, శిఖర కలశాలకు ఆలయ అర్చకులు పూజాధికాలు జరిపారు. దేవస్థానం ఈఓ ఎన్‌వీఎస్‌ఎన్ మూర్తి, డీఈఓ భద్రాజీ, ఏఈఓ రమణరాజు, సూపరింటిండెంట్ దుర్గాప్రసాద్ తదితరులున్నారు.


