
గురువులపై కర్ర పెత్తనం
వీరు పరిశీలించే అంశాలు
నిడమర్రు: కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ గురువులపై రోజు రోజుకూ నిఘా పెరుగుతూనే ఉంది. అందులో భాగంగా బడుల్లో నిర్వహిస్తున్న ప్రతి కార్యక్రమానికి పరిశీలకులు, సాక్షులు, నోడల్ పర్సన్స్‌ల పేరుతో ఇతర శాఖ అధికారులు, సిబ్బందితో ఉపాధ్యాయులపై పెత్తనం చేస్తున్నారంటూ వారు ఆరోపిస్తున్నారు. మరో పక్క రాష్ట్ర స్థాయి నుంచి మండల స్థాయి వరకూ విద్యాశాఖ అధికారుల తనిఖీలు మామూలే. తాజాగా ఒక పక్క డైట్ కళాశాల అధ్యాపకులతో తనఖీలు చేస్తుండంగా మరో పక్క మండల అకడమిక్ ఫోరంలు ఏర్పాటు చేసి ఉపాధ్యాయులపై పర్యవేక్షణ పెంచేలా విద్యాశాఖ సిద్ధమైంది. ఇప్పటికే మూల్యాంకన పుస్తకాలు దిద్దడం, హోలిస్టిక్ ప్రోగ్రస్ కార్డులు అందించడం, మార్కులు ఆన్‌లైన్ చేయడం, టీచర్ డైరీ నింపడం వంటి కార్యక్రమాలతో వారం రోజులుగా ఉపాధ్యాయులకు బోధనకు దూరంగా ఉన్న సమయంలో ఉన్నత అధికారులతో తనిఖీలు చేయడంపై ఉపాధ్యాయ వర్గం మండిపడుతోంది.
నాలుగు మండలాలకు ఒక డైట్ లెక్చరర్
దూబచర్ల డైట్ కళాశాలల్లో ఉన్న 11 మంది అధ్యాపకులకు నాలుగు మండలాల చొప్పున ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల పనితీరుపై నివేదికలు అందించేలా ఉన్నత అధికారులు వారిని నియమించారు. వీరంతా వారికి కేటారయించిన మండలాల్లో ఎంపిక చేసుకున్న పాఠశాలల్లో ఉపాధ్యాయుల పనితీరు, విద్యార్థుల విద్యా సామర్థ్యాలు, భోజన పథకం వంటి అనేక అంశాలను పరిశీలించి జిల్లా అధికారులకు రోజువారీ నివేదిక అందించాల్సి ఉంది.
మండల ఎకడమిక్ ఫోరంలు
ప్రతి మండలాల్లో ఇప్పటికే మండల అకడమిక్ ఫోరంలు ఏర్పాటు చేశారు. ఈ ఫోరంలో ఎంఈవో 1, 2లు, నాలుగు క్లస్టర్ చైర్మన్‌లు, హైస్కూల్ సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ టీచర్లు ఏడుగురు, ప్రైమరీ ఎక్సపర్ట్ టీచర్స్ 5గురుని నియమించారు. వీరంతా వారానికి రెండు సార్లు మండల ప్రాతిపదికగా పాఠశాలలు పరిశీలన చేయాల్సి ఉంది. ఈ ఫోరంలో ఎంఈవో1, ఎంఈవో2 రెండు వేర్వేరు బృందాలుగా ఆయా గ్రామాల్లో ప్రాథమిక పాఠశాలలను ఏకకాలంలో విజిట్ చేస్తారు. అలాగే విజిట్ జరుగుతున్న రోజు సంబంధిత స్కూళ్లలో ఏ టీచర్‌కు సెలవు మంజూరు చేయరు. అందరూ తప్పనిసరిగా హాజరయ్యేలా చర్యలు తీసుకుంటారు.
బువ్వనపల్లి జెడ్పీస్కూల్లో ఉపాధ్యాయుల పనితీరును పరిశీలిస్తున్న డైట్ లెక్చరర్ లక్ష్మీనారాయణ (ఫైల్)
అర్ధవరం జెడ్పీస్కూల్లో మూల్యాంకన పుస్తకాలు తనిఖీ చేస్తున్న డీఈవో నారాయణ (ఫైల్)
రోజురోజుకీ పెరుగుతున్న నిఘా
ఒక పక్క డైట్ లెక్చరర్లతో తనిఖీలు
మరో వైపు మండల అకడమిక్ ఫోరంల ఏర్పాటు
రోజువారీ హాజరుపైనా పర్యవేక్షణ
ఉక్కిరిబిక్కిరవుతున్న ఉపాధ్యాయులు
విద్యార్థి, ఉపాధ్యాయుల హాజరు సమయం, సిలబస్, టెక్ట్స్ బుక్, వర్క్ బుక్స్, నోట్ బుక్స్ పరిశీలన. ప్రతి శనివారం నిర్వహించే నోబ్యాగ్ డే కృత్యాల పుస్తకాలు, అభ్యసనా ఫలితాలు అంచనా వేయడం, మూల్యాంకన పుస్తకాలు, టీచర్ డైరీలు, స్కూల్ నమోదుపై జరుగుతున్న కృషి, మధ్యాహ్నా భోజన పథకం రికార్డులు, విద్యాప్రవేశ్ కార్యక్రమం నిర్వహణ వంటి అనేక అంశాలు పరిశీలిస్తారు. వీరందరూ అందించిన నివేదికలను సరి పోల్చుకుని ఆ పాఠశాల పనితీరుపై రాష్ట్రస్థాయిలో ఒక సమగ్ర నివేదిక అందించేలా జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకుంటారు.

గురువులపై కర్ర పెత్తనం