
సందిగ్ధంలో వీసీ పీఠం
● వ్యాజ్యపరమైన అంశంతో ముడి
● 11న స్పష్టత వచ్చే అవకాశం
తాడేపల్లిగూడెం: డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్ ఉద్యోగ కాల పొడిగింపు, లేదంటే కొత్త వారి నియామకం వ్యవహారం సందిగ్ధతకు ఇంకా తెరపడలేదు. వ్యవహారం వ్యాజ్యపరమైన వివాదంతో ముడిపడి ఉండటంతో ఇంకా కామాలతో వ్యవహారం సాగుతోంది. ప్రస్తుత వీసీ ఉద్యోగ కాలం ఆగస్టు 31తో ముగిసింది. యూజీసీ నిబంధనల ప్రకారం జీఓ నంబరు 39ను అనుసరించి తనకు 65 ఏళ్ల వయస్సు వచ్చే వరకు వీసీ పదవిలో కొనసాగించాలని వీసీ గోపాల్ హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. దీనిపై స్పందించిన హైకోర్టు గత నెలలో ఈ నిబంధన వ్యవసాయశాఖ పరిధిలో ఉద్యోగులుగా ఉన్న వారికి వర్తించదని, దీనిపై మరోసారి అఫిడవిట్ సెప్టెంబరు 29న దాఖలు చేయాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా వీసీ కొనసాగింపు, లేదా ఇన్‌చార్జిని నియమించడం వంటి ప్రక్రియను పూర్తి చేయలేదు. ఈలోగా అఫిడవిట్ దాఖలుకు ముందు నాయస్థానంలో జరిగిన వాదనల నేపథ్యంలో మరోమారు ఈ నెల 11న ఉద్యానవర్సిటీ వీసీ వ్యవహారంపై వాదనలు జరుగనున్నాయని తెలిసింది. దీంతో వీసీ కొనసాగింపు, లేదంటే కొత్త వారిని నియమించడం అనేది 11న తేలవచ్చని తెలుస్తోంది.
తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు..
ఉద్యోగ నియామక పత్రాలను ఉద్యోగులకు ప్రభుత్వాలు ఇచ్చే సమయంలో అంటిల్ ఫర్‌దర్ ఆర్డర్ అనే పదాన్ని నియామకపు లేఖలో ఉటంకిస్తాయి. అంటే తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఇచ్చిన ఉద్యోగంలో కొనసాగవచ్చు అని అర్థం. అంటే ఉద్యోగకాలం ఉన్న వారికి మాత్రమే అంటిల్ ఫర్‌దర్ ఆర్డర్ అనే నిబంధన వర్తిస్తుంది. అంతే కాని ఉద్యోగ విరమణ చేసిన వారి విషయంలో వర్తించదు. ఉద్యానవర్సిటీ వీసీగా ఉన్న కె.గోపాల్ ఉద్యోగకాలం ఆగస్టు 31తో ముగిసింది. అంటిల్ ఫర్‌దర్ ఆర్డర్ మార్గదర్శకాలు ఆయనకు వర్తించదని అధికార వర్గాల సమాచారం. అయితే వీసీ తర్వాత పర్యవేక్షక బాధ్యతలు వహించాల్సిన వ్యక్తులు కూడా అంటిల్ ఫర్‌దర్ ఆర్డర్‌ను అడ్డుపెట్టుకొని తన పైఅధికారి విషయంలో మౌనంగా ఉన్నారని తెలుస్తోంది. గురువారం జరుగనున్న రాష్ట్ర క్యాబినెట్‌లో టేబుల్ అజెండాగా పెట్టే విషయంలో ఉద్యానవర్సిటీ వీసీ అంశంగా ఉండవచ్చనే ఊహాగానాలు ఉన్నాయి.