
ఇసుక లారీల స్వాధీనం
చింతలపూడి: ఆంధ్రప్రదేశ్ నుంచి అక్రమంగా గోదావరి ఇసుకను హైదరాబాద్ తరలిస్తున్న లారీలను చింతలపూడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చింతలపూడి మండలం ఏపీ, తెలంగాణ సరిహద్దు ప్రాంతాలగుండా ఇసుకను తెలంగాణలో అధిక ధరలకు విక్రయిస్తూ అక్రమార్కులు అక్రమంగా ఆర్జిస్తున్నారు. గురువారం తెల్లవారుజామున పోలవరం, కొవ్వూరు ఇసుక రీచ్‌ల నుంచి తరలిస్తున్న 16 ఇసుక లారీలను స్థానికుల సమాచారం మేరకు అల్లిపల్లి సమీపంలో చింతలపూడి సీఐ క్రాంతికుమార్ ఆధ్వర్యంలో పోలీసులు పట్టుకున్నారు. పట్టుకున్న లారీలను రెవెన్యూ అధికారులకు బైండోవర్ చేశారు. కాగా ఇసుక లారీలు పట్టుబడిన వెంటనే అప్రమత్తమైన అక్రమార్కులు వాటిని విడిపించుకునేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసినట్లు తెలిసింది. అయితే పోలీసులు ఎలాంటి వత్తిళ్ళకు తలొగ్గకుండా కేసులు నమోదు చేశారు. నిత్యం వందలాది లారీల్లో ఇసుక ఏపీ నుంచి తెలంగాణ రాష్ట్రం తరలి పోతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో ప్రత్యేక నిఘా పెట్టి ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.