● జలదిగ్బంధంలో 25 గ్రామాలు
● నేటికీ బయట పడని రహదారులు
● పడవ ప్రయాణమే ఆ గ్రామాలకు దిక్కు
వేలేరుపాడు: ఒక వైపు గ్రామాలను చుట్టుముట్టిన గోదావరి వరద.. మరో వైపు అడపా దడపా జోరున కురుస్తున్న వాన.. ముంపు మండలాల వాసులను మూడు నెలలలుగా కలవరపెడుతున్నాయి. భద్రాచలం వద్ద గోదావరి వరద నీటి మట్టం తగ్గుతూ.. పెరుగుతూ దోబూచులాడుతోంది. ఎగువన ఉన్న తుపాకులగూడెం సమ్మక్క, సారక్క పూర్తిగా గేట్లు ఎత్తివేశారు. దీంతో 8 లక్షల క్యూసెక్కుల నీరు కిందకు వదిలారు. దీనికి తోడు తాలిపేరు వరద తోడవ్వడంతో బుధవారం 43 అడుగులకు నీటిమట్టం పెరగడంతో మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. గురువారం రాత్రి 8.30కు గోదావరి నీటి మట్టం 42.60 అడుగులకు చేరడంతో ఉపసంహరించారు. వరద వల్ల జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో 18 రోజులుగా వేలేరుపాడు మండలంలో 25 గ్రామాలు జలదిగ్భంధనంలోనే ఉన్నాయి. వేలేరుపాడు నుంచి కొయిదా వెళ్లే రహదారిలో మేళ్ళవాగు, ఎద్దెలవాగు, టేకూరు, తదితర వాగుల వంతెనలు ముంపులోనే ఉన్నాయి. దిగువనున్న కొయిదా, కాచారం, పేరంటపల్లి, టేకుపల్లి, తాళ్ళగొంది, పూసుగొంది, టేకూరు, కట్కూరు, సిద్దారం, ఎడవల్లి, చిట్టంరెడ్డిపాలెం, ఎర్రతోగు, చిగురుమామిడి, బోళ్ళపల్లి, పాతనార్లవరం, తూర్పుమెట్ట, కొత్తూరు, తదితర గ్రామాలతోపాటు మరో ఎనిమిది గ్రామాలు జలదిగ్బంధనంలోనే ఉన్నాయి. వేలేరుపాడు నుంచి రేపాకగొమ్ము, వెళ్లే రహదారి నేటికీ మోకాల్లోతు నీరు పారుతోంది. దీంతో ఆయా గ్రామ ప్రజలు మోకాల్లోతు నీటిలో ప్రయాణిస్తున్నారు. రుద్రమకోట వెళ్లే రహదారులు ఇంకా నీటిలోనే మునిగి ఉండటంతో ఆయా గ్రామాల ప్రజలు లచ్చిగూడెం గ్రామం గుండా రాకపోకలు సాగిస్తున్నారు.
పడవ ప్రయాణమే దిక్కు
దిగువ ప్రాంతంలో ఉన్న 18 గిరిజన గ్రామాలకు గత మూడు నెలలుగా పడవ ప్రయాణమే దిక్కయింది. ఎద్దెలవాగు, టేకూరు, వాగుల వంతెనలు నీట మునగడంతో పడవల పైనే ప్రయాణం సాగిస్తున్నారు. ఏ అవసరమున్నా మండల కేంద్రమైన వేలేరుపాడుకు రావాలంటే పడవ దాటి రావాల్సిందే. పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు కూడా పడవల పైనే పాఠశాలలకు వస్తున్నారు. గురువారం టేకూరు వాగు వద్ద స్థానిక పోలీసులు పడవ దాటించి పాఠశాలలకు పంపుతున్నారు. ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఆదేశాలతో లైఫ్ జాకెట్‌లతో బోట్‌లపై ప్రయాణిస్తున్నారు.
పాతనార్లవరం గ్రామాన్ని
పట్టించుకోని అధికారులు
జలదిగ్బంధనంలో ఉన్న పాతనార్లవరం గ్రామాన్ని అధికారులు పట్టించుకోకుండా వదిలేశారు. ఇక్కడ 50 కుటుంబాలున్నాయి. ఈ గ్రామానికి వెళ్లే రహదారి నీటమునిగి జలదిగ్బంధనంలో ఉన్నప్పటికీ ఆ గ్రామానికి కనీసం పడవ కూడా ఏర్పాటు చేయకపోవడంతో గ్రామస్తులు నానా ఇబ్బందులు పడుతున్నారు.
వదలని వరద గోదావరి
వదలని వరద గోదావరి