
గంజాయి కేసులో ఆరుగురి అరెస్ట్
ఏలూరు టౌన్: గంజాయి విక్రయిస్తున్న నలుగురిని అరెస్ట్ చేయగా, ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్నట్లు ఏలూరు త్రీటౌన్ సీఐ కోటేశ్వరరావు తెలిపారు. ఏలూరు త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఆయన ఎస్సై పీ రాంబాబుతో కలిసి వివరాలు వెల్లడించారు. ఈనెల 3వ తేదీన ఏలూరు మినీబైపాస్ రోడ్డులో గ్రాండ్ కృష్ణ ఫంక్షన్ హాల్ ప్రాంతంలో గంజాయి విక్రయిస్తున్నారని సమాచారం మేరకు ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆదేశాలతో ఏలూరు డీఎస్పీ డీ.శ్రావణ్‌కుమార్ పర్యవేక్షణలో సిబ్బందితో దాడులు చేశామన్నారు. ఈ దాడుల్లో నిందితులు ఏలూరుకు చెందిన విష్ణుశెట్టి సత్యరూప్‌కుమార్ అలియాస్ సతీష్, కొమ్మిన మణికంఠ అలియాస్ సర్థార్‌పాండా, తమ్మిశెట్టి రామ్‌చరణ్, అల్లంపల్లి రాజేష్ తోపాటు మరో ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. వారివద్ద నుంచి సుమారు మూడున్నర కిలోల గంజాయి, రెండు మోటారు సైకిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. నిందితులపై ఏలూరు మండలంలోని ఆయా పోలీస్‌స్టేషన్లలో ఇప్పటికే వివిధ కేసులు నమోదయ్యాయని చెప్పారు.