
భయం గుప్పెట్లో లంక గ్రామాలు
న్యూస్‌రీల్
శనివారం శ్రీ 23 శ్రీ ఆగస్టు శ్రీ 2025
సాక్షి, భీమవరం: వశిష్ట గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి వస్తున్న జలాలు దిగువన లంక గ్రామాలను ముంచెత్తుతున్నాయి. జిల్లాలోని గోదా వరి పరీవాహక లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుంటున్నాయి. భద్రాచలం వద్ద ఉధృతి తగ్గుతుండటం ఊరటనిస్తున్నా గోదావరి శివారు ప్రాంతం కావడంతో వరద నీరు సముద్రంలోకి చేరే వరకు జిల్లాకు ముంపు ముప్పు పొంచి ఉందంటున్నారు.
ఎగువన భారీ వర్షాలతో..
గోదావరి ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో జిల్లాలోని వశిష్ట గోదావరికి రెండు రోజులుగా వరద ఉధృతి పెరిగింది. శుక్రవారం ఉదయం 8 గంటల సమయానికి ధవళేశ్వరం బ్యా రేజీ వద్ద నీటిమట్టం 14.10 అడుగులకు చేరడంతో జలవనరులశాఖ అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీచేశారు. మధ్యాహ్నం 5 గంటల సమయానికి నీటిమట్టం 14.30 అడుగులకు చేరుకోగా 10,800 క్యూసెక్కుల నీటిని పంట కాలువలకు, 13.57 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. భద్రాచలం వద్ద ఉదయం 6 గంటల సమయానికి 49 అడుగులుగా ఉన్న నీటిమట్టం సాయంత్రం 4 గంటల సమయానికి 44.80 అడుగులకు తగ్గింది. ఎగువన వరద తగ్గుతుండటంతో ఒకటి రెండు రోజుల్లో జిల్లాలోను తగ్గుముఖం పడుతుందని జలవనరుల శాఖ అధికారులు భావిస్తున్నారు.
భయం.. భయం
వరద ఉధృతికి లంకల్లో సాగు చేస్తున్న కాయగూరలు, ఇతర ఉద్యాన పంటలు నీటమునిగిపోయాయి. ఆచంట, పెనుగొండ, యలమంచిలి మండలాల్లోని పలు లంక గ్రామాల పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. కనకాయలంక కాజ్‌వే పూర్తిగా నీటమునిగిపోయింది. తప్పనిసరి పరిస్థితుల్లో లంక గ్రామాల ప్రజలు ట్రాక్టర్లు, పడవలపై రాకపోకలు సాగించాల్సి వస్తుంది. గోదావరి నుంచి కొట్టుకు వచ్చిన విషసర్పాలు స్థానికులను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఆచంట మండలం అయోధ్యలంక, పుచ్చలలంక, రావిలంక గ్రామాల నుంచి ప్రమాదపుటంచున విద్యార్థులు పడవపై కోడేరులోని పాఠశాలకు వస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో అధిక సంఖ్యలో జనం నాటు పడవల్లో ప్రయాణిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.
నరసాపురంలో.. నరసాపురం వద్ద గోదావరి నీటిమట్టం బాగా పెరిగి వలంధర్ రేవులో గోదావరి మాత విగ్రహం పాదాలను తాకుతూ ప్రవహిస్తోంది. ఈ రేవులో స్నానాలను నిషేధించారు. లలితాంబ ఘాట్, బాపుఘాట్‌లను వరద నీరు ముంచెత్తింది. పిండ ప్రదానం షెడ్డు లోపలికి నీరు చేరింది. వరద ఉధృతి దృష్ట్యా నరసాపురం–సఖినేటిపల్లి రేవులో పంటు రాకపోకలు వరుసగా రెండో రోజు కూడా నిలిపివేశారు. వరద ఉధృతి పెరుగుతుండటంతో గోదావరి తీరం వెంబడి ఉన్న పొన్నపల్లి, మాధవాయిపాలెం ప్రాంతాల వారు ముంపు భయంతో ఆందోళన చెందుతున్నారు.
పొంచి ఉన్న ముప్పు
వరద తీవ్రత పెరుగుతుండటం లంక వాసుల్ని ఆందోళనకు గురిచేస్తోంది. యలమంచిలి మండలంలో ఏటిగట్టుకు దిగువన ఉన్న దొడ్డిపట్ల మత్స్యకార కాలనీ, కనకాయలంక, పెదలంక, లక్ష్మీపాలెం, యలమంచిలిలంక, బాడవ గ్రామాలకు ముంపు బెడద ఎక్కువ. ఆయా గ్రామాల్లో పది వేలు వరకు జనాభా ఉంటారు. కంచుస్తంభంపాలెం, అబ్బిరాజుపాలెం, గంగడుపాలెం గ్రామాల్లో ఏటిగట్టు దిగువన ఉన్న కొన్ని ఇళ్లు, ఆచంట మండలంలోని అయోధ్యలంక, పెదమల్లం లంక, పుచ్చలంక, అనగారిలంక, పల్లిపాలెం గ్రామాలు వరద ముంపునకు గురవుతుంటాయి. ఆయా గ్రామాల్లో సుమారు 8 వేలకు పైగా ప్రజలు నివసిస్తున్నారు. ఉధృతి పెరిగే కొద్ది ఈ గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుంటాయి. గత ప్రభుత్వంలో వరద ఉధృతికి ముందే వలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు అవసరమైన సహాయక చర్యలు చేపట్టేవారు. ప్రస్తుతం ఆ దిశగా చర్యలు మృగ్యమవుతున్నాయని స్థానికులు అంటున్నారు.
వరద గోదావరి
లంక గ్రామాలను ముంచెత్తిన వరద
జలదిగ్బంధంలో ఇళ్లు
ఆందోళనలో లంక గ్రామాల ప్రజలు
కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక

భయం గుప్పెట్లో లంక గ్రామాలు

భయం గుప్పెట్లో లంక గ్రామాలు

భయం గుప్పెట్లో లంక గ్రామాలు

భయం గుప్పెట్లో లంక గ్రామాలు