‘ఆరోగ్యశ్రీ’ నిలిపివేతపై ఆందోళన | - | Sakshi
Sakshi News home page

‘ఆరోగ్యశ్రీ’ నిలిపివేతపై ఆందోళన

Aug 23 2025 6:27 AM | Updated on Aug 23 2025 6:27 AM

‘ఆరోగ్యశ్రీ’ నిలిపివేతపై ఆందోళన

‘ఆరోగ్యశ్రీ’ నిలిపివేతపై ఆందోళన

‘ఆరోగ్యశ్రీ’ నిలిపివేతపై ఆందోళన

భీమవరం వర్మ ఆస్పత్రిలోసేవలు నిలిపివేస్తూ ఉత్తర్వులు

కలెక్టరేట్‌కు చేరిన డయాలసిస్‌ రోగులు, బంధువులు

భీమవరం(ప్రకాశం చౌక్‌): భీమవరంలోని వర్మ ఆస్పత్రి (ఎన్టీఆర్‌ వైద్య సేవ నెట్‌వర్క్‌ ఆస్పత్రి)లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తూ ఎన్టీఆర్‌ వైద్య ట్రస్ట్‌ సీఈఓ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో శుక్రవారం నుంచి ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. కేసుల విషయంలో అవకతవకలు జరిగినట్టు ఆడిట్‌, రాష్ట్రస్థాయి కమిటీ విచారణలో గుర్తించడంతో ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీలో ఉచిత సేవలు పొందుతున్న సుమారు 200 మంది డయాలసిస్‌ రోగులు తీవ్ర ఆందోళన చెందారు. వైద్య సేవలు నిలిపివేస్తే తమ ప్రాణాలకు ముప్పు తప్పదని భయపడ్డారు. రోగులు, వారి కుటుంబ సభ్యులతో కలిసి భీమవరంలోని కలెక్టరేట్‌కు వెళ్లి జాయింట్‌ కలెక్టర్‌, డీఎంహెచ్‌ఓను కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రి నిర్లక్ష్యం, అధికారుల నిర్లిప్తత కారణంగా తమ ప్రాణాలను పణంగా పెట్టవద్దని బోరుమన్నారు. అకస్మాత్తుగా సేవలు నిలిపివేస్తే తమ పరిస్థితి ఏంటని వాపోయారు. తమకు అక్కడే సేవలు కొనసాగించాలని కోరారు. ఇదిలా ఉండగా ఆస్పత్రికి వచ్చిన పలువురు రోగులు సేవలు నిలిపివేయడంతో ఇబ్బందులు పడ్డారు.

సేవలు కొనసాగించేందుకు చర్యలు: డీఎంహెచ్‌ఓ

కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌ ఆదేశాల మేరకు ప్రస్తు తం వర్మ ఆస్పత్రిలో ఎన్టీఆర్‌ వైద్య సేవలో డయాలసిస్‌ సేవలు పొందుతున్న వారికి అక్కడే డయాలసిస్‌ సైకిల్స్‌ పూర్తయ్యే వరకూ సేవలందించేందుకు చర్యలు తీసుకున్నామని డీఎంహెచ్‌ఓ గీతాబాయి తెలిపారు. తర్వాత జిల్లాలో రోగులకు సమీపంలో ఉన్న డయాలసిస్‌ యూనిట్‌లకు తరలిస్తామని, డయాలసిస్‌కు సంబంధించి కొత్త కేసులకు వర్మ ఆస్పత్రిలో అడ్మిషన్లు ఉండవని చెప్పారు.

ప్రాణాలతో చెలగాటమా.. రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడటం తగదని కేవీపీఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.క్రాంతిబాబు అన్నారు. సేవలను ఒక్క సారిగా నిలిపివేసి రోగుల ప్రాణాలకు ముప్పు తీసుకురావడం దారుణమన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, స్థానికంగా డయాలసిస్‌ సేవలు పూర్తిస్థాయిలో అందించాలని కోరారు. జిల్లా కేంద్రం భీమవరంలో కేంద్ర మంత్రి, రాజసభ్య సభ్యుడు, పీఏసీ చైర్మన్‌ వంటి వారు ఉన్నా ప్రభుత్వ డయాలసిస్‌ యూనిట్‌ లేకపోవడం బాధాకరమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement