
నూలి అరాచకాల నుంచి రక్షించండి
నరసాపురం: నరసాపురంలోని పద్మశ్రీ అద్దేపల్లి సర్విశెట్టికి చెందిన బీజీబీఎస్ మహిళా కళాశాల పాలకవర్గం వ్యవహారాలపై రోజురోజుకూ వ్యతిరేకత పెరుగుతోంది. కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ నూలి శ్రీనివాస్ రౌడీలను పెట్టి తమను ఇల్లు కదలకుండా చేస్తున్నారని, స్థలాన్ని, ఇంటిని దౌర్జన్యంగా ఖాళీ చేయిస్తున్నారని వెలిగట్ల కిన్నెర, శ్రీను దంపతులు శుక్రవారం ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, తమకు ఆత్మహత్యే శరణ్యమని విలేకరుల వద్ద కన్నీటి పర్యంతమయ్యారు. కళాశాల కాంట్రాక్ట్ అధ్యాపకులు 55 రోజులుగా నిరసన దీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా పట్టణం నడిబొడ్డున విజయలక్ష్మి కంటి ఆస్పత్రి వద్ద కళాశాల యా జమాన్యం 99 ఏళ్లకు లీజుకిచ్చిన స్థలాన్ని హస్తగ తం చేసుకుని 30 ఏళ్లుగా నివాసం ఉంటున్న త మను రోడ్డు పాలు చేయాలని చూస్తున్నారని కిన్నెర దంపతులు వాపోయారు. ఇదిలా ఉండగా సర్విశెట్టి ఆస్తుల విషయంలో జరుగుతున్న అన్యాయంపై అధికారులు చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు పీడీ రాజు డిమాండ్ చేశారు. 30 ఏళ్లుగా ఉంటున్న వారికి కనీసం నోటీసులు ఇవ్వకుండా దౌర్జన్యం చేయడం తగదన్నారు. మరోవైపు కళాశాల ఆస్తులు నూలి శ్రీనివాస్ అమ్ముకుంటుంటే తాము ఆందోళన చేసినా అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. దళిత ఉద్యమ నేత చింతపల్లి గురుప్రసాద్ మాట్లాడుతూ నరసాపురంలో మహిళలపై అరాచకాలు, దౌర్జన్యాలు జరుగుతుంటే డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే అండదండలతోనే ఇవన్నీ జరుగుతున్నాయన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు కవురు పెద్దిరాజు, వైఎస్సార్‌సీపీ నేతలు బిళ్లు బ్రదర్స్, నిప్పులేటి సత్యనారాయణ మాట్లాడుతూ నూలి శ్రీనివాస్ ఆగడాలపై ఆందోళన ఉధృతం చేస్తామని, మహనీయుడు సర్విశెట్టి ఆశయాలు కాపాడతామని అన్నారు.
బీజీబీఎస్ మహిళా కళాశాల వ్యవహారంలో రోడ్డెక్కిన మరో కుటుంబం