
నిర్వాసితుల సమస్యలపై పార్లమెంట్‌లో మాట్లాడతా
బుట్టాయగూడెం: సీపీఎం ఫ్లోర్ లీడర్, కేరళ ఎంపీ జాన్ బ్రిట్టాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తులసీదాస్, సీపీఎం నాయకుల బృందం శనివారం ఏజెన్సీ ప్రాంతంలో పర్యటించింది. బృంద సభ్యులు టేకూరు నిర్వాసిత కాలనీని సందర్శించారు. నిర్వాసితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రెడ్డిగణపవరం వద్ద సభలో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం సర్వం కోల్పోయిన నిర్వాసితుల సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నట్లు కనిపించిందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల లక్ష ఆరువేల గిరిజన కుటుంబాలు ముంపునకు గురువుతున్నాయన్నారు. నిర్వాసితులకు పునరావాసం, వసతులపై ఉత్సాహం చూపించడం లేదన్నారు. 80 శాతం గిరిజనులు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల తమ ఉనికిని కోల్పోతున్నారని వారికి సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు పూర్తి స్థాయిలో పునరావాసం, మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. నిర్వాసితుల సమస్యలను పార్లమెంట్‌లో మాట్లాడతానని చెప్పారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ. రవి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి. బలరామ్, తదితరులు పాల్గొన్నారు.