
నేరాలకు పాల్పడితే కఠిన శిక్షలు
ఏలూరు టౌన్: నేరాలకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పదనే రీతిలో కోర్టు మానిటరింగ్ సెల్ సిబ్బంది చిత్తశుద్దితో పనిచేయాలని ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు అన్నారు. ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ ఆదేశాలతో జిల్లాలోని కోర్టు మానిటరింగ్ సెల్ టీమ్ అధికారులు, సిబ్బందితో ఆయన సమీక్షించారు. ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు, పోలవరం పోలీస్ సబ్ డివిజన్‌కు చెందిన కోర్టు మానిటరింగ్ సెల్ టీమ్ సమీక్షకు హాజరయ్యారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ.. నిందితులకు శిక్షలు పడేలా... బాధితులకు సత్వర న్యాయం జరిగేలా మరింత శ్రద్ధగా, సమర్ధవంతంగా పనిచేయాలని సూచించారు. నేరస్తులు తప్పించుకోకూడదని, బాధితులు పోలీస్, న్యాయస్థానాలపై నమ్మకం పెరిగేలా కృషి చేయాలని చెప్పారు. ప్రతి రోజూ కోర్టులో జరిగిన ప్రక్రియను డాక్యుమెంట్ రూపంలో స్టేషన్ అధికారికి నివేదించాలని తెలిపారు. ఏలూరు జిల్లాలో కోర్టు మానిటరింగ్ సెల్ మరింత సమర్ధవంతంగా పనిచేయాలని సూచించారు. సమీక్షలో టీడీసీ డీఎస్పీ ప్రసాదరావు, కోర్టు మానిటరింగ్ సెల్ సీఐ యం.సుబ్బారావు, డీసీఆర్‌బీ సీఐ హబీబ్ భాషా, సిబ్బంది ఉన్నారు.
ఏలూరు (టూటౌన్): ఈ నెల 20న ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సమావేశం శ్రీకాకుళంలో నిర్వహించనున్నట్టు యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు లింగమల్లు శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్లకు కూటమి ప్రభుత్వం న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో పలు సమస్యలపై తీర్మానాలు చేసి సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లనున్నామని పేర్కొన్నారు.