ప్రభుత్వ అసంబద్ధ విధానాలపై గళం
భీమవరం: పాఠశాల విద్యారంగంలో ప్రభుత్వం అవలంబిస్తున్న అసంబద్ధ విధానాలకు వ్యతిరేకంగా శుక్రవారం భీమవరం కలెక్టరేట్ వద్ద ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు జి.ప్రకాశం మాట్లాడుతూ 1 నుంచి 5వ తరగతి వరకు ప్రతి ప్రాథమిక పాఠశాలను బేసిక్ ప్రాథమిక పాఠశాల లేదా మోడల్ ప్రాథమిక పాఠశాలగా కొనసాగించాలన్నారు. ప్రాథమికోన్నత పాఠశాలలో మరిన్ని స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఉన్నత పాఠశాలకు 6 నుంచి 10వ తరగతి వరకు స్కూల్ అసిస్టెంట్లతో పాటు ప్రధానోపాధ్యాయుడు, వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి బీవీ నారాయణ మాట్లాడుతూ ఉపాధ్యాయులకు బకాయి ఉన్న మూడు డీఏలను విడుదల చేయాలని, 12వ పీఆర్సీ కమిషన్‌ను నియమించి మధ్యంతర భృతి కింద 30 శాతం ఇవ్వాలన్నారు. ఓపీఎస్‌ను అమలు చేయాలన్నారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ నాగరాణికి అందజేశారు. ధర్నాలో గౌరవాధ్యక్షుడు పీఎన్‌వీ ప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షుడు లంక రాజు, కండిబోయిన రాంబాబు, పోతురాజు, దేవదాసు కార్యదర్శులు పి.జనార్దనస్వామి, వి.రామ్మోహన్, పీవీ రాఘవులు పాల్గొన్నారు.


