అసత్య ప్రచారాలను ఉపేక్షించం
చింతలపూడి: యుద్ధ సంబంధిత అంశాలపై అసత్య ప్రచారాలను సోషల్ మీడియా ద్వారా వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ హెచ్చరించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా చింతలపూడి పోలీస్ స్టేషన్‌ను శుక్రవారం ఆయన సందర్శించారు. స్టేషన్‌లో రికార్డులు పరిశీలించారు. ఆపరేషన్ సిందూర్‌ను పురస్కరించుకుని అన్ని ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని, కొత్త వ్యక్తులపై నిఘా ఉంచాలని సూచించారు. డ్రోన్ కెమెరాల పర్యవేక్షణ ద్వారా నేరాల గుర్తించి, ట్రాఫిక్ సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. హైస్కూల్, కాలేజీలు, రద్దీ ప్రదేశాల్లో శక్తి యాప్‌పై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి పౌరుడు భాగస్వామిగా ఉండాలని, దేశ సమగ్రతకు భంగం కలిగించే మత విద్వేషాలు, అసత్య ప్రచారాలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. హెల్మెట్ ధరించడం బాధ్యత అని అన్నారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులను గుర్తిస్తే వెంటనే డయల్ 112కు సమాచారం ఇవ్వాలని ఎస్పీ సూచించారు. డీఎస్పీ యు.రవిచంద్ర, సీఐ సీహెచ్ రాజశేఖర్, ఎస్సై కుటుంబరావు, సిబ్బంది పాల్గొన్నారు.


