వాహన దొంగల అరెస్టు
కై కలూరు: వాహనదారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న దొంగలను కలిదిండి పోలీసులు శనివారం అరెస్టు చేశారు. కలిదిండి పోలీసు స్టేషన్‌లో రూరల్ సర్కిల్ సీఐ వి.రవికుమార్, ఎస్సై వి.వెంకటేశ్వరరావు కేసు వివరాలు వెల్లడించారు. పేట కలిదిండికి చెందిన వనమాల జగదీష్(31), కలిదిండికి చెందిన చేబోయిన శ్యాంతేజా(28) ఇటీవల ఈ ప్రాంతంలో 5 వాహనాలను దొంగతనం చేశారు. వీరిపై నిఘా ఉంచిన పోలీసులు ఎట్టకేలకు వీరిని అదుపులోకి తీసుకుని మొత్తం వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించడంలో ప్రతిభ చూపిన ఎస్సై వి.వెంకటేశ్వరరావు, ఏఎస్సై కె.వెంకటేశ్వరరావు, కానిస్టేబుళ్లు బి.రమేష్, డి.వడ్డీ కాసులు, హోంగార్డు కట్టా శ్రీనులను సీఐ రవికుమార్ అభినందించారు.
రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి
భీమవరం: మోటారుసైకిల్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో విద్యార్థి మృతి చెందాడు. భీమవరం టూటౌన్ ఎస్సై ఇజ్రాయిల్ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని ప్రైవేట్ కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతున్న రాజమహేంద్రవరానికి చెందిన ఎం జ్ఞానసాగర్(21) శుక్రవారం రాత్రి తన స్నేహితుడు కె సాయిభరత్‌తో కలసి గరగపర్రు రోడ్డులోని తన రూమ్ నుంచి మోటారు సైకిల్‌పై పట్టణంలోకి వచ్చారు. పని ముగించుకుని తిరిగి వెళుతుండగా ఎదురుగా వస్తున్న మోటారుసైకిల్‌ను తప్పించబోయి అదపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో జ్ఞానసాగర్ తలకు తీవ్ర గాయాలు కాగా సాయిభరత్‌కు స్వల్పగాయలయ్యాయి. వెంటనే వైద్యం కోసం ఆసుపత్రికి తరలించగా జ్ఞానసాగర్ మృతిచెందినట్లు వైద్యులు చెప్పారు. సాయిభరత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు.
పురుగు మందు తాగి..
పెనుగొండ: అనారోగ్యంతో మనస్తాపానికి గురై ఆచంట శివారు బాలం వారి పాలెంకు చెందిన వేండ్ర శ్రీను (49) పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వేండ్ర శ్రీను గత కొంత కాలంగా కేన్సర్‌తో బాధపడుతున్నాడు. దీనికి తోడు కుమార్తే సైతం మానసిక వ్యాధితో బాధ పడుతుండడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. దీంతో శనివారం కలుపు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కలుపు మందు తాగడం గమనించిన భార్య కుమారుడుకు చెప్పడంతో హుటాహుటిన శ్రీనుని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం నిమిత్తం తణుకు, ఏలూరు ప్రభుత్వాసుపత్రులకు తరలించారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో డ్యూటీ డాక్టర్ పరీక్షించి శ్రీను మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి బంధువు వేండ్ర మురళీ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఆచంట ఎస్సై కేవీ రమణ తెలిపారు.


